POLAVARAM COPPER DAM: గోదావరికి భారీ వరద వస్తుండటంతో ఎగువ కాఫర్ డ్యాం రక్షణపై జల వనరులశాఖ మల్లగుల్లాలు పడుతోంది. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ డ్యాం పొడవునా 24 గంటలూ కాపలా కాస్తూ ఏ ఇబ్బందీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతస్థాయి నుంచి పోలవరం అధికారులకు ఆదేశాలు అందాయి. అవసరమైతే ఎగువ కాఫర్ డ్యాంను అప్పటికప్పుడు మరికొంత ఎత్తు పెంచేందుకు అవసరమైన మనుషులు, సామగ్రి, యంత్రపరికరాలు సిద్ధం చేసుకోవాలన్న ఆదేశాలున్నాయి. పోలవరంవద్ద ప్రస్తుతం గోదావరి వరద సుమారు 17 లక్షల క్యూసెక్కులు ప్రవహిస్తోంది. భద్రాచలంవద్ద గురువారం రాత్రికి 65 అడుగులకు నీటిమట్టం చేరే అవకాశం ఉందని అంచనా. మేడిగడ్డ బ్యారేజీ నుంచి 28.58 లక్షల క్యూసెక్కుల వరదనీరు వదిలారు. ఈ పరిస్థితుల్లో పోలవరంవద్ద ప్రవాహాలు 25 లక్షలనుంచి 28 లక్షల క్యూసెక్కుల మధ్య ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో భారీవర్షాలు కురుస్తున్నాయి. ఇంకా ప్రాణహిత నుంచి వరద వస్తూనే ఉంది. ప్రవాహాలు 30 లక్షల క్యూసెక్కులు దాటే అవకాశాలను కొట్టిపారేయలేమని, ముందుజాగ్రత్తగా ఈ మేర ప్రవాహాలు అంచనా వేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.
పోలవరంలో ఎగువ కాఫర్ డ్యాంను 28.50 లక్షల క్యూసెక్కులు తట్టుకునే స్థాయికి నిర్మించారు. ప్రస్తుతం అంతకు మించి ప్రవాహాలు వస్తే ఏంటన్న కోణంలో చర్చ సాగుతోంది. పోలవరం ఎగువ కాఫర్ డ్యాంవద్ద ప్రస్తుతం 36 మీటర్ల ఎత్తున నీటి నిల్వ ఉంది. ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు 43 మీటర్లు. ప్రస్తుతం నీటి మట్టానికి, కాఫర్ డ్యాం ఎత్తుకు మధ్య తేడా 7 మీటర్లు ఉన్నా... పైన 2 మీటర్లు పూర్తి కోర్‌తో నిర్మించింది కాదని చెబుతున్నారు. దాంతో 5 మీటర్ల ఎత్తునే పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుత ప్రవాహానికే 36 మీటర్ల ఎత్తు వస్తే.. 25-30 లక్షల క్యూసెక్కుల మధ్య ప్రవాహాలు వస్తే ఎగువ కాఫర్ డ్యాం మీదుగా వరద ప్రవహిస్తుందా అన్న అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో అవసరమైతే అప్పటికప్పుడు కొంతమేర ఎగువ కాఫర్ డ్యాంపై ఇసుక బస్తాలు, రాళ్లు పేర్చి కొంత ఎత్తు పెంచగలమా అన్న కోణంలోనూ ప్రయత్నాలు సాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రతి వంద మీటర్లకు వంద ఇసుక బస్తాలు, రాళ్లు సిద్ధం చేసుకుని ఉంచుతున్నారు. పోలవరం చీఫ్ ఇంజినీరు సుధాకర్‌బాబు అక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నారు. గురువారం ఉదయం నుంచి ఎగువ కాఫర్ డ్యాం పొడవునా అటూ, ఇటూ తనిఖీలు చేయించారు. ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయేమో అన్న కోణంలో పరిశీలన సాగింది. ఇద్దరు డీఈఈలు, ఒక ఈఈని రాత్రి డ్యూటీకి నియమించారు. ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. పోలవరంలో 48 గేట్లతోపాటు రివర్ స్లూయిస్ గేట్ల నుంచి నీటిని దిగువకు వదులుతున్నామని చెబుతున్నారు.
వేయికళ్లతో కాపాడుతున్నాం: మంత్రి అంబటి రాంబాబు
పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్ డ్యాంను వైకాపా ప్రభుత్వమే పూర్తిచేసిందని, ఈ వరదలతో దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వేయికళ్లతో కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. జులై రెండో వారంలోనే గోదావరికి ఇంత వరద రావడం అనూహ్యమన్నారు. పోలవరం వద్ద ప్రస్తుతం 16 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోందని, ఎగువ నుంచి ఇంకా పెరుగుతూనే ఉండటంతో అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వద్ద దిగువ కాఫర్ డ్యాంను దాటివచ్చిన వరద వల్ల అక్కడి కట్టడాలకు ఎలాంటి సమస్య ఉండబోదన్నారు. అదంతా స్పిల్ వే దాటిన నీరు వెనక్కి తన్నడం వల్ల ఏర్పడిందేనని చెప్పారు. విజయవాడలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే రెండు వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతిందని, ఇప్పుడు నీరు చేరడం వల్ల ఆ కట్టడానికి కొత్తగా వచ్చే ఇబ్బంది ఏదీ ఉండబోదన్నారు.
పోలవరం ప్రాజెక్టును నెలలోనో, రెండు నెలల్లోనో, అయిదు నెలల్లోనే పూర్తిచేస్తామని ఎవరైనా చెబితే అది అద్భుత కథ మాత్రమేనని అంబటి వ్యాఖ్యానించారు. దశల వారీగానే పూర్తి చేస్తామన్నారు. పోలవరం తొలిదశ ఎప్పటికి పూర్తి చేస్తామో త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఏ పెద్ద ప్రాజెక్టునూ ఫలానా తేదీకి పూర్తిచేస్తామని చెప్పి చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం వరద నేపథ్యంలో నిర్వాసితులను తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. జలవనరులశాఖ, రెవెన్యూ, విపత్తు నిర్వహణశాఖలు కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లోపు అన్ని ప్రాధాన్య ప్రాజెక్టులు పూర్తిచేసి జాతికి అంకితం చేయాలనే సంకల్పంతో ఉన్నామని చెప్పారు.
ఇవీ చదవండి: