భూమాతకి జ్వరం వస్తే- ఒకటీ రెండూ కాదు, అన్నీ ఉత్పాతాలే.. మొత్తంగా మానవాళి మనుగడకు పెను ప్రమాదాలే. పెరిగే ఎండలూ వడగాలులూ, వద్దన్నా కురిసే వానలూ వాటివల్ల వచ్చే వరదలూ, ఆరని మంటలకు ఆహుతవుతున్న అటవీ సంపదా, మాడి మసవుతున్న జీవవైవిధ్యమూ... వెరసి ప్రకృతి సమతౌల్యాన్ని చిరునామా లేకుండా చేస్తున్నాయి. భూతాపం పెరగడం వల్లే ఈ గందరగోళమంతా జరుగుతోందనీ, వాతావరణంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయనీ ఇక నుంచీ ఇవి మరింత తరచుగా సంభవిస్తుంటాయనీ ఈసారి కాస్త గట్టిగానే హెచ్చరిస్తోంది ఐపీసీసీ. ఈ పరిస్థితుల కారణంగా గడచిన రెండు దశాబ్దాల్లోనూ ఎరుగని తీవ్ర అనావృష్టిని ఈ ఏడాది పలుదేశాల్లో చూడాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు శాస్త్రవేత్తలు. వివిధ పనుల వల్ల ఉత్పత్తి అవుతున్న గ్రీన్‌హౌస్ వాయువులకీ పర్యావరణం నుంచీ తొలగించాల్సిన వాయువులకీ మధ్య సమతౌల్యం సాధించడం(నెట్‌జీరో ఎకానమీ) ఇప్పుడు దేశాలన్నిటి ముందూ ఉన్న సమస్య. ఆ దిశగా అత్యవసర చర్యలు చేపట్టక తప్పదని హెచ్చరిస్తోంది ఐపీసీసీ.
భూతాపం ఎందుకు పెరుగుతోంది?
భూమి ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోందని రెండొందల ఏళ్ల క్రితం ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త జీన్ బాప్టిస్ట్ జోసెఫ్ ఫోరియర్ గుర్తించారు. ఆ తర్వాత వందేళ్లకు గ్రీన్‌హౌస్ వాయువులే ఆ ఉష్ణోగ్రత పెరగడానికి కారణమని తెలిసింది. 1976లో మొట్టమొదట స్వీడన్ శాస్త్రవేత్త స్టీఫెన్ స్నైడర్ భూతాపాన్ని శాస్త్రీయంగా వివరించారు. పారిశ్రామిక విప్లవం మొదలయ్యాక విపరీతంగా పెరిగిన పరిశ్రమలకీ రవాణాకీ బొగ్గూ పెట్రోలే ఆధారం కావడంతో కర్బన కాలుష్యం పెరుగుతూ వచ్చింది. ఈ కాలుష్యం భూతాపాన్ని పెంచుతోంది. అది ఎంత వేగంగా పెరుగుతోందంటే గడిచిన పదేళ్లలోనే డిగ్రీ సెల్సియస్‌కి పైగా పెరిగిందట. వరసగా గత 438 నెలల్లో ఒక్కటి కూడా చల్లటి నెల నమోదు కాలేదట. ఇక, ఈ ఏడాది జులై నెల ప్రపంచ చరిత్రలోనే ‘హాటెస్ట్ జులై’గా రికార్డు కెక్కింది.
జులైలో వర్షాలు పడ్డాయిగా..?
రుతుపవనాల వల్ల మనకి ఇక్కడ వర్షాలు పడ్డాయి కానీ జులై మొదటివారంలో కూడా ఉత్తరాదిన పలుప్రాంతాలు తీవ్ర ఎండలతో సతమతమయ్యాయి. జులై సగం అయిపోయాక కానీ దిల్లీలో వానలు కురవలేదు. ప్రపంచంలోని మిగతా ప్రాంతాల పరిస్థితీ అంతే. వాతావరణ ఉష్ణోగ్రతలకు సంబంధించి వందేళ్లలో జరగనన్ని మార్పులు గత నాలుగు దశాబ్దాల్లో జరిగాయి. పోయిన దశాబ్దంలో దాదాపు ప్రతి ఖండంలోనూ ఏదో ఒక ఏడాది గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక వాటన్నిటినీ తలదన్నేలా ఈ ఏడాది జులై నెల ‘హాటెస్ట్ జులై’గా రికార్డు సృష్టించింది. భూమి, సముద్ర ఉష్ణోగ్రతల సగటుని లెక్కలేసి చూసి ఈ విషయాన్ని తేల్చారు. ఉత్తరార్ధ గోళంలో ఈ ఏడాది 1.54 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగిందట. ఈ ఏడాదే అమెరికా, కెనడాల్లో సూర్యుడి భగభగలను తట్టుకోలేక కొన్ని వందలమంది చని పోయారు. ఆఖరికి సైబీరియా లాంటి అతి శీతల ప్రాంతంలోనూ వేడిగాలులు వీస్తున్నాయి. అమెరికాలో కొలరాడో నది మీద కట్టిన హూవర్ డామ్ నీటిమట్టం కనీవినీ ఎరగనంత తక్కువ స్థాయికి పడిపోవడంతో తీవ్ర కరవు ముంచుకొచ్చే ప్రమాదం ఉందని భయపడుతున్నాయి అక్కడి ప్రభుత్వాలు. లాస్ ఏంజెలిస్, లాస్ వెగాస్ లాంటివి సుసంపన్న నగరాలుగా అభివృద్ధి చెందింది ఈ ఆనకట్ట వల్లనే.
1901 తర్వాత ఈ ఏడాది జూన్‌లో అక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో శతాబ్దానికి ఒక్కసారో రెండుసార్లో సంభవించే అత్యధిక ఉష్ణోగ్రతలు ఇప్పుడు దాదాపు ఐదేళ్లకోసారి నమోదవుతున్నాయి.
భూమి మీద వెలువడే గ్రీన్‌హౌస్ వాయువుల్లో 85 శాతాన్ని సముద్రాలు గ్రహిస్తాయి కాబట్టి మరో పక్కనుంచీ అవీ వేడెక్కిపోతున్నాయి. అంతేకాదు, గత రెండేళ్లుగా ప్రపంచంలో ఏదో ఒక పక్కన కార్చిచ్చు మండుతూనే ఉంది. మొదట ఆస్ట్రేలియా, తర్వాత అమెజాన్ అడవులు, ఇప్పుడు కాలిఫోర్నియా, టర్కీ, గ్రీస్, ఇటలీ, స్పెయిన్... వీటిల్లో కొన్నిచోట్ల నెలల తరబడి అడవులు తగలబడుతూనే ఉన్నాయి. చుట్టుపక్కల ఊళ్లనీ కబళిస్తూనే ఉన్నాయి. ఈ వేడి వల్లే మరో పక్క మంచు కరిగిపోయి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి.
మంచు కరిగితే ఏమవుతుంది?
మంచు కరగడం వల్ల సముద్రాల్లో నీటిమట్టం పెరుగుతుంది. గూగుల్, యూరోపియన్ యూనియన్‌లకు చెందిన కోపర్నికస్ ప్రాజెక్టు, నాసా, మరో అమెరికన్ విశ్వవిద్యాలయమూ కలిసి చేపట్టిన ఒక అధ్యయనంలో 37 ఏళ్ల నుంచి భూగోళంపై వస్తున్న మార్పులను ఉపగ్రహాల ద్వారా వీక్షించారు. ఆ ఫొటోలతో రూపొందించిన వీడియోలో భూమిపై హిమనదాలు వేగంగా కరిగిపోవడం చూస్తే ఎవరికైనా గుండె జారిపోతుంది. 2015 తర్వాత కేవలం నాలుగేళ్లలో ఏటా దాదాపు మూడొందల గిగాటన్నుల చొప్పున మంచు కరిగిపోయిందట. ఒక గిగాటన్ను అంటే వందకోట్ల మెట్రిక్ టన్నులకు సమానం. గత ఇరవై ఏళ్లలోనే దాదాపు 50వేల గిగాటన్నుల మంచు కరిగినట్లు అంచనా. ఇలా 120 ఏళ్లుగా కరుగుతున్న మంచు వల్ల సముద్ర నీటి మట్టాలు ఇప్పటికే ఎనిమిది అంగుళాలు పెరిగినట్లు నాసా లెక్కగట్టింది. అందువల్లే తుపాన్ల నష్టం పెరుగుతోందనీ గుర్తించింది.
భూమిని ఎండ తీవ్రత నుంచి కాపాడే కవచాల్లాంటివి ఈ హిమనదాలు. అవే లేకపోతే సూర్యుడి వేడి అంతా భూమి పీల్చుకుని ఇంకా తీవ్రంగా వేడెక్కేది. ధ్రువప్రాంతాలతో పాటు హిమాలయాల్లాంటి పర్వతాల్లోనూ మంచు వేగంగా కరిగిపోతోంది. ఆ నీరంతా వరదగా
సముద్రంలోకి చేరుతోంది. ఈ పరిణామాలన్నీ కలిసి వాతావరణ వైపరీత్యాలనీ వాటి వల్ల మనిషి కష్టాల్నీ పెంచుతున్నాయి.
వైపరీత్యాలంటే..?
ఒక పద్ధతి ప్రకారం సాగాల్సిన ఆరు రుతువుల విధానం గతి తప్పినప్పుడు ఏర్పడే పరిస్థితులను వాతావరణ వైపరీత్యాలు అంటారు. భూతాపం పెరగడం వల్ల అలాంటి వైపరీత్యాలు 1970-2005 మధ్య 250 సార్లు సంభవిస్తే 2005-2019 మధ్య పద్నాలుగేళ్లలోనే 310 సార్లు సంభవించాయి. గత ఏడాదిలోనే భారీ వరదలు 40 లక్షల మందిని నిర్వాసితుల్ని చేశాయనీ ఇక ముందు ఏటా దాదాపు పదికోట్ల మంది వరదల బారిన పడతారనీ ప్రకృతి విపత్తుల ప్రభావం ఆసియా మీదే ఎక్కువనీ శాస్త్రవేత్తల అంచనా. ఇంకా...
ఎండలు పెరిగితే ఎడారులు పెరుగుతాయి. నీటి వనరులు లేక పంటలు పండవు. జలవిద్యుదుత్పత్తి తగ్గిపోతుంది. దాంతో వ్యాపార, పారిశ్రామిక, సేవారంగాలన్నీ నష్టపోతాయి. తీవ్రమైన కరవు వస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా ప్రాంతాలు అలా మారాయి.
ఈ అసాధారణ పరిస్థితుల వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోతుంటే అందులో ఏడున్నరలక్షల మంది భారతీయులు ఉంటున్నారని లాన్సెట్ అధ్యయనంలో వెల్లడైంది. 2000 సంవత్సరం నుంచి 2019 వరకు ప్రపంచవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతలూ, మరణాల డేటాను విశ్లేషించి ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. అంతేకాదు, విష జ్వరాలూ అంటువ్యాధులూ పెరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో కొవిడ్ వైరస్ విజృంభణకీ అదే కారణమని ‘జియో హెల్త్’ జర్నల్ ప్రచురించింది. తాగునీరూ గాలీ కలుషితమై ఇన్‌ఫెక్షన్లూ గుండెజబ్బులూ శ్వాస సమస్యలూ పెరుగుతాయి. ఆఖరికి మనిషి మెదడు పనితీరూ మందగిస్తుంది.
వ్యవసాయమూ దాని అనుబంధ పరిశ్రమల దిగుబడీ తగ్గడంతో వలసలు పెరిగి వాతావరణ శరణార్థులు తయారవుతున్నారు. 2050నాటికి వారి సంఖ్య ఇరవై కోట్లకు చేరుతుందని అంచనా.
కార్చిచ్చులకు తోడు అడవుల నరికివేత వల్ల మరో రెండు తరాల తర్వాత అడవులనేవి ఉండకపోవచ్చట.
బొగ్గు వల్ల విపరీతమైన కాలుష్యం వెలువడుతుందని తెలిసినా ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు వినియోగం 1998 తర్వాత ఏటా పెరుగుతూనే ఉంది.
వాతావరణ మార్పుల ప్రభావ తీవ్రతను అంచనా వేసే ‘క్లైమేట్ రిస్క్’ సూచీలో ప్రస్తుతానికి మనదేశం ఏడో స్థానంలో ఉంది. ఇక్కడ సగటు ఉష్ణోగ్రత 0.7 సెంటీగ్రేడ్ పెరగ్గా ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే కొనసాగిస్తే వచ్చే అరవై ఏళ్లలోనే అది రెండు డిగ్రీలు దాటుతుందని అధ్యయనాలు చాటుతున్నాయి. వాతావరణ ముప్పుల వల్ల 2030 నాటికి మన వ్యవసాయరంగం 5లక్షల కోట్లకు పైగా నష్టపోతుందనీ, పదిశాతం ప్రజల ఆదాయాలు తగ్గిపోతాయనీ ప్రపంచ బ్యాంకు హెచ్చరిస్తోంది.
మనం మండే ఎండల్నీ ముంచే వానల్నీ మాత్రమే చూస్తున్నాం. కొన్ని దేశాలు చీటికీ మాటికీ ఎగసిపడే తుపానుల్నీ మరికొన్ని దేశాలు కంపించే భూమినీ బిక్కు బిక్కుమంటూ చూస్తున్నాయి.
ఇప్పటికే ఒక డిగ్రీకి పైగా పెరిగిన భూతాపాన్ని ఒకటిన్నర డిగ్రీలకు మించకుండా చూడాలన్నది ఇప్పుడు ప్రపంచం ముందున్న ఏకైక సవాలు. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలను ఇలాగే కొనసాగించినా 2100 సంవత్సరం నాటికి భూతాపం దాదాపు మూడు డిగ్రీలు పెరుగుతుందని నిపుణుల అంచనా. ఒక్క డిగ్రీకే ఇన్ని రకాల పరిణామాలను చూస్తున్న నేపథ్యంలో, అది మూడు డిగ్రీలు దాటితే... అసలు మానవ జాతి మనుగడ సాగిస్తుందా అన్నది శాస్త్రవేత్తలను వణికిస్తున్న ప్రశ్న.
తప్పు ఎవరిదైనా భూతాపం పెరగడం వల్ల ఎదురయ్యే ముప్పును మాత్రం అందరం భరించాలి... ప్రాణాలతో ఉండే అవకాశాలే లేకపొయ్యాక, కోట్లు కూడబెట్టి ఇస్తే మాత్రం మన పిల్లలు ఏం చేసుకుంటారు! అందుకే ప్రతి వ్యక్తీ ప్రతి ప్రభుత్వమూ తమవంతుగా పర్యావరణ పరిరక్షణకు నడుం బిగిస్తేనే భూగోళం అనే మన ఇంటిని భావితరాలకు భద్రంగా అందించగలుగుతాం! అప్పుడే- మనబిడ్డలూ వారి బిడ్డలూ పదికాలాలు పచ్చగా బతకగలుగుతారు!
ఐపీసీసీ అంటే..
ఇంటర్ గవర్నమెంటల్ పానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్- దీన్నే క్లుప్తంగా ఐపీసీసీ(వాతావరణ మార్పులపై అంతర ప్రభుత్వాల కమిటీ) అంటారు. 1988లో ఐక్యరాజ్యసమితివారి ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్, వరల్డ్ మెటియొరాలాజికల్ ఆర్గనైజేషన్ కలిసి దీన్ని ప్రారంభించాయి. వివిధ దేశాలకూ, రంగాలకూ చెందిన వందలాది నిపుణులు తమ నైపుణ్యాలనూ సమయాన్నీ వెచ్చించి, అధ్యయనాలు చేసి, ప్రపంచవ్యాప్త పరిణామాలపై సమాచారాన్ని ఈ సంస్థకి అందజేస్తారు. దాన్ని క్రోడీకరిస్తూ ఐపీసీసీ నివేదికలను రూపొందిస్తుంది. 195 దేశాలు
సభ్యులుగా ఉన్న ఐపీసీసీకి 2007లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. సభ్యదేశాల ప్రభుత్వాలు ఇచ్చే నిధులతో నడుస్తూ నిపుణుల స్వచ్ఛంద సేవలను ఉపయోగించుకుంటూ ప్రపంచ సంక్షేమానికి పనిచేస్తున్నందువల్లనే ఐపీసీసీ మాటకి అంత విలువ.
వానలు వణికిస్తున్నాయి..!
వాన ప్రాణాధారం. నేలని నమ్ముకుని బతికే మనిషికి అదనుకి పడిన వానని మించిన వరమేముంటుంది. ఒకప్పుడంతా అలాగే ఉండేది. రుతుపవనాలు వేళకి వచ్చేవి. చిన్నగా తొలకరి జల్లులతో మొదలై ఆషాఢంలో ఆశలు పెంచి శ్రావణంలో నిండుగా కురిసి ప్రజల అవసరం తీరగానే వాటి దారిన అవి పోయేవి. వాటికి అనుగుణంగా ఉండేది మన జీవన విధానం. అందుకే- ఆరుద్రలో అడ్డెడు చల్లినా పుట్టెడు పంట, ఉత్తర చూసి ఎత్తర గంప... లాంటి సామెతలు వాడుకలోకి వచ్చాయి. అలా తరతరాలుగా మన మనుగడకి ఆలంబనగా నిలుస్తూ వచ్చిన రుతుపవనాలు ఇప్పుడు గతి తప్పుతున్నాయి. ఆలస్యంగా రావడం, అంతంతమాత్రంగా విస్తరించడం ఆనవాయితీగా మారింది. ఎప్పుడన్నా సమయానికి వచ్చినా కుండపోతగా గుమ్మరిస్తూ వానలంటేనే ప్రజలు వణికిపోయే పరిస్థితి తెస్తున్నాయి.
గ్లోబల్ వార్మింగ్ సమస్య మన రుతుపవనాలను ప్రమాదకరంగా మార్చేస్తోందని ‘సైన్స్ అడ్వాన్సెస్’ పత్రిక పేర్కొంది. దాని కారణంగా రుతుపవనాల వర్షపాతం పెరుగుతోందనీ, ఆకస్మిక, భారీ వర్షాలు ఎక్కువవుతున్నాయనీ ఇటీవల బంగాళాఖాతంలో 30మంది శాస్త్రవేత్తల బృందం చేపట్టిన అధ్యయనం తేల్చిచెప్పింది.
జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు 30వాతావరణ మోడల్స్‌ని అధ్యయనం చేసి భూమ్మీద ఉష్ణోగ్రతలు ఒక సెంటీగ్రేడ్ పెరిగితే వర్షాలు ఐదుశాతం పెరుగుతాయని ప్రకటించారు.
రుతుపవనాల్లో వచ్చిన మార్పుల వల్లే మనదేశంలో పిడుగులు ఎక్కువగా పడి ఏటా రెండువేల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు.
నెల రోజుల వ్యవధిలో అప్పుడప్పుడు కురవాల్సిన వాన కుండపోతగా ఒకేరోజున 20 నుంచి 27 సెం.మీ.ల వరకు కుమ్మరించిన సంఘటనలు ఈమధ్య తెలుగు రాష్ట్రాల్లోనే పలుసార్లు జరిగాయి. ఇక, చైనాలో అయితే ఇటీవల ఏకంగా ఏడాది కురవాల్సిన వర్షం నాలుగు రోజుల్లో కురిసి వరదల్లో ముంచెత్తింది, లక్షలాది ప్రజల్ని నిరాశ్రయుల్ని చేసింది.
విశాఖపట్నంలో బీచ్ మునిగిపోతుందా..?
సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న దేశం మనది. కోట్లాది రూపాయల పెట్టుబడితో అక్కడ కట్టిన పెద్ద పెద్ద ఓడరేవుల ద్వారా దేశ సంపదను పెంచే వ్యాపారం జరుగుతుంది. అందమైన బీచ్‌లు పర్యటకుల్నీ ఆకర్షించి సేదతీరుస్తాయి. సముద్ర నీటిమట్టం ఆధారంగానే ఎన్నో
ప్రణాళికలు వేసి ఈ నిర్మాణాలు చేపడతారు. మరో ఇరవై ముప్పై ఏళ్లలో అవన్నీ మునిగి పోతాయంటే... ఎంత కష్టం... ఎంత నష్టం? భూతాపం పెరగడం వల్ల మన తీర ప్రాంతాల్లో 10 నుంచి 30 అంగుళాల(0.1 నుంచి 0.3మీటర్లు) వరకూ నీటిమట్టం పెరిగే
అవకాశం ఉందని నాసా ప్రకటించింది. ఆ లెక్కల ప్రకారం ఈ శతాబ్దం చివరికల్లా విశాఖపట్నంలో ఆర్కే బీచ్ రోడ్డు వరకు మునిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కోచి, గోవా, ముంబయి, మంగళూరు, చెన్నై, వైజాగ్, పరదీప్ రేవులన్నీ ఆ ప్రభావానికి లోనవుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలూ దివిసీమ లాంటివి సమస్యలు ఎదుర్కొంటాయని నిపుణులు అంటున్నారు. ప్రపంచ సగటు కన్నా ఎక్కువగా మరో ఇరవై ఏళ్లలోనే గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో సముద్రమట్టం 0.22 మీటర్ల ఎత్తు పెరిగి పలు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయట. అయితే ఆ ప్రభావం రేవులవరకే ఆగదన్నది గుర్తుంచుకోవాలి. సముద్రం నీరు లోలోపలికి చొచ్చుకురావడంతో వ్యవసాయ భూమి పనికి రాకుండా పోతుంది. ఇప్పటికే తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రభావం కన్పిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దాంతానికల్లా చైనాలో 4.3 కోట్లు, మన దేశంలో 3.2 కోట్లు, బంగ్లాదేశ్‌లో 2.7 కోట్ల మంది మునక ప్రభావానికి లోనవుతారని పరిశోధకుల అంచనా.
మనమేం చేద్దాం..!
భూతాపం తగ్గించడానికి మన వంతుగా ఏం చేయొచ్చంటే...
- ఒక కారు 26వేల మైళ్లు తిరిగితే వెలువడే కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకోవడానికి ఎకరం దట్టమైన అడవిలో ఉన్న చెట్లకు ఏడాది పడుతుందట. ఆ లెక్కన మనం వాడే కార్లకు ఎన్ని అడవులు కావాలీ..! అందుకే వీలైన ప్రతిచోటా చెట్లను పెంచాలి.
- తక్కువ దూరాలకు నడిచి లేదా సైకిల్‌పై వెళ్లాలి. దూరప్రయాణాలకు ప్రజారవాణా మేలు. అత్యవసరమైతే తప్ప విమాన ప్రయాణం చేయకూడదు. పెట్రోలు వాడకం ఎంత తగ్గిస్తే అంత మేలు.
- ఇల్లయినా, ఆఫీసైనా అనవసరంగా లైట్లూ ఫ్యాన్లూ ఏసీలూ వేసి ఉంచవద్దు. కరెంటు వృథా తగ్గితే దాని తయారీకి బొగ్గు వాడకమూ తగ్గుతుంది. ఎలక్ట్రానిక్ పరికరాలు కొనేటప్పుటు తక్కువ కరెంటుతో పనిచేసే నాణ్యమైన వస్తువుల్నీ లేదా సౌరశక్తితో పనిచేసే వస్తువుల్నీ ఎంచుకోవాలి.
- నీటిని పొదుపుగా వాడుకోవాలి.
- ఒకసారి వాడి పారేసే వస్తువులు ఏవీ మంచిది కాదు. మళ్లీ మళ్లీ వాడుకోవడానికి పనికొచ్చే వస్తువులనే కొనుక్కోవాలి.
- పాత కలప వస్తువుల్ని పారేయకుండా వాటిని మార్చి మరో వస్తువుగా చేయించుకోవచ్చు. తలుపుచెక్కతో కుర్చీలూ బల్లలూ చేయించుకోవచ్చు. దాంతో చెట్లను నరకడం తగ్గుతుంది.
- డబ్బు ఉందని పెద్ద ఇల్లూ మనిషికో కారూ కొనుక్కుంటే అదే స్థాయిలో విద్యుత్తూ పెట్రోలూ ఖర్చవుతాయి. అవసరానికన్నా ఎక్కువైనవేవైనా భూమికి భారమే.