శ్రీరామ నవమి సందర్భంగా.. రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరోనా నిబంధనల నడుమ ఈ వేడుకలు జరుపుకున్నారు.
నెల్లూరులో
పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా పెళ్లకూరు, నాయుడుపేట మండలాల్లో శ్రీ రామనవమి ఉత్సవాలు కొవిడ్ నిబంధనలు నడుమ నిర్వహిస్తున్నారు. పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు గ్రామంలో నెల రోజుల పాటుగా ఉభయాలు నిర్వహిస్తారు. రాత్రి చేయాల్సిన ఉభయాలను పగటి పూట సాదాసీదాగా చేస్తున్నారు. భక్తులు దేవతామూర్తుల విగ్రహాలకు అభిషేకాలు చేశారు.
అనంతపురంలో
అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయంలో.. శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు సీతారాముల కల్యాణోత్సవాన్ని.. అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారామ లక్ష్మణ ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామినాపిని దర్శించుకుంటున్నారు.
కర్నూలులో
శ్రీరామ నవమి సందర్భంగా కర్నూలు జిల్లా నంద్యాల సంజీవనగర్ గేట్ సమీపంలో.. శ్రీ కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేశారు. బాదం, ఎండు ద్రాక్ష తదితరాలతో తయారు చేసిన మాలను ములవిరాట్ స్వామివారికి వేసి అలంకరించారు. రాంబోట్ల దేవాలయంలో సీతారాములకు కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బీ.వై. రామయ్య పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కొబ్బరిపై కోదండరాముడు
తూర్పుగోదావరిలో
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలో శ్రీరామనవమి వేడుకలను.. ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట ,రావులపాలెం మండలాల్లోని సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయాలను వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు.
పశ్చిమగోదావరిలో
శ్రీరామ నవమి సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలోని సీతారామచంద్ర, ఆంజనేయ స్వామి వార్ల ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివార్లను దర్శించుకుని పూజలు చేశారు.
ఉండ్రాజవరం ప్రధాన రహదారిలో ఉన్న సీతారామచంద్ర స్వామి ఆలయం భక్తులతో.. ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.కరోనా విజృంభణ దృష్టిలో ఉంచుకొని ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: హనుమంతుడి జన్మస్థానంపై తితిదే ప్రకటన