పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి బాధితులు ఆస్పత్రిలోనే చేరుతూనే ఉన్నారు. ఐదు రోజులతో పోల్చుకొంటే.. ఆరోరోజు బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వందల్లో నమోదైన కేసులు.. ప్రస్తుతం పదుల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఆరు రోజు 13 మంది వింతవ్యాధి బాధితులు ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 32 మంది చికిత్స పొందుతున్నారు. విజయవాడలో మరో 33మంది చికిత్సపొందుతున్నారు. మొత్తంగా 65మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఏలూరులో నగరంలో వింతవ్యాధి బారినపడినవారి సంఖ్య 609కి చేరుకుంది. ఇందులో 543మంది డిశ్ఛార్జి అయ్యారు.
కేసులు తగ్గుముఖం..
మొదటిరోజు 108కేసులు నమోదు కాగా.. రెండోరోజు 209, మూడోరోజు176, నాలుగోరోజు 66, ఐదోరోజు 18, ఆరోరోజు 13 కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య తగ్గడంతోపాటు.. వ్యాధి తీవ్రత తగ్గిందని వైద్యులు అంటున్నారు. బాధితులు కొద్దిసేపటికే కోలుకొని ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఆరు రోజులు గడిచిన వింతవ్యాధి మాత్రం నిర్ధారణ కాలేదు. పలు జాతీయ సంస్థలు ఏలూరుకు చేరుకొని పరిశోధనలు సాగిస్తున్నాయి. బాధితుల రక్తనమునాలు, తాగునీరు, పాలు, కూరగాయాల నమూనాలు సేకరించి.. పరీక్షించారు. ఇందులో భారలోహలైన సీసం, నికేల్ ఉన్నట్లు వెల్లడైంది.
అక్కడే అధిక కేసులు...
దిల్లీ ఎయిమ్స్, ఇండియాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థలు అందించిన నివేదికలో సీసం, నికేల్ అధిక మోతాదులో ఉన్నట్లు తెలియజేశారు. పాలు, కూరగాయలు వంటి ఆహార పదార్థాల్లో ఆర్గనో క్లోరిన్, ఇతర క్రిమిసంహారక మందుల అవశేషాలు బయటపడ్డాయి. శరీరంలో ఉన్న సీసం, నికేల్ కు ఆర్గనో క్లోరిన్ కలిసినప్పుడు మూర్చ వస్తోందని ఇప్పటికే కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. నగరానికి తాగునీటినిని అందించే.. పంపుల చెరువు సమీపంలో అధిక వింత వ్యాధి బాధిత కేసులు నమోదైనట్లు కమిటీ పరిశీలనలో వెల్లడైంది. ఈ నీరు ముందుగా వెళ్లే.. పత్తేబాద, అశోక్ నగర్, ఒకటో పట్టణం వంటి ప్రాంతాల్లో అధిక కేసులు వచ్చినట్లు కనుగొన్నారు.
కమిటీగా జాతీయ సంస్థలు..
దిల్లీ ఎయిమ్స్, ఎన్ ఐఎన్, ఎన్ సీడీసీ, ఎన్ ఐవీ ఈ నాలుగు జాతీయ సంస్థలు కమిటీగా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలోని నిపుణులు వింతవ్యాధి కారణాలు పరిశోధిస్తున్నారు. ఆరో రోజు సైతం ఈ కమిటీ నిపుణులు ఏలూరులో వివిధ ప్రాంతాలను పరిశీలించారు. వట్లూరు పారిశ్రామికవాడలో పలు పరిశ్రమలను సందర్శించారు. నగరంలో బాధితులు అధికంగా ఉండే ప్రాంతాల్లో పాలు, కూరగాయాలు, తాగునీటి నమూనాలు సేకరించి.. పరీక్షకు పంపారు.
శుక్రవారం నివేదికలు..
కొత్తగా చేరుతున్న బాధితుల రక్త నమూనాలు సేకరించారు. ఈ కమిటీతోపాటు.. హైదరాబాద్కు చెందిన సీసీఎంబీ సంస్థ ఈ పరిశోధనలో పాల్గొంటోంది. ఇప్పటికే సేకరించిన నమూనాలు ఈ సంస్థకు పంపారు. ఈ సంస్థ నివేదిక ఆలస్యంగా వచ్చే ఆస్కారం ఉందని అధికారులు అంటున్నారు. రేపు సాయంత్రంగానికి 90 శాతం వరకు నివేదికలు రానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పూర్తిస్థాయిలో వ్యాధి నిర్ధారణ చేసేందుకు మరో నిపుణుల కమిటీని నియమించనున్నారు. వివిధ శాఖలకు చెందిన రాష్ట్ర ఉన్నతాధికారులు ఇందులో ఉంటున్నారు.
పూర్తిస్థాయిలో పరిశీలన...
జాతీయ సంస్థలు అందించిన నివేదికను ఈ నిపుణుల కమిటీ విశ్లేషించనుంది. పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత వ్యాధి నిర్ధారణ చేసే ఆస్కారం ఉంది. బాధితుల శరీరాల్లోకి లెడ్, నికేల్, ఇతర ఆర్గనో క్లోరిన్స్ ఎలా చేరాయన్నదానిపైనే పరిశోధనలు సాగుతున్నాయి. తాగునీరు, పాలు, కూరగాయలు వంటి వాటి నుంచి శరీరంలోకి వెళ్లి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. వీటిలోకి సీసం, నికేల్, ఆర్గనో క్లోరిన్ ఎలా వ్యాపించిందన్నదానిపైనే పూర్తి నివేదిక అందే ఆస్కారం ఉంది.
ఈ వింత వ్యాధి దేనివల్ల వచ్చిందని తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వ్యాధి నిర్ధారణ జరిగితే.. ఏలూరు నగరంలో ముందుస్తు జాగ్రత్తలు తీసుకొనే ఆస్కారం ఉందని ప్రజలు అంటున్నారు.
ఇదీ చదవండి: ఏలూరు ఘటనపై రేపు నివేదిక సమర్పిస్తాం : మంత్రి ఆళ్లనాని