కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించారు. దీనికి తోడు ఈ నెల 15 నుంచి జూన్ 14 వరకు సముద్ర చేపల వేటపై నిషేధం ఉంది. దీంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాలు ఆదుకోకపోతే బతుకు బండి భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం నియోజకవర్గంలోనే 19 కిలోమీటర్ల పరిధిలో తీరం విస్తరించి ఉంది. 9 గ్రామాల్లో సుమారు 1.20 లక్షలకు పైగా మత్స్యకారులు ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం వేటపై ఆధారపడి జీవిస్తారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన 63 మోటార్ బోట్లు మాత్రమే ఉన్నాయి. ఇవికాక 251 సంప్రదాయక బోట్లతో వేట సాగిస్తున్నారు. వీరికి చేపల వేటే జీవనాధారం. గుర్తింపు పొందిన బోట్లు, పడవలపై వేట సాగించే వారికే కరవు భత్యం చెల్లిస్తున్నారు. మిగిలిన వారు అనర్హులుగా మిగిలిపోతున్నారు. వేటతో పాటు అనుబంధంగా జీవించే వేలాది మందికి ఉపాధి దొరకని పరిస్థితి నెలకొంది. వేసవిలో సముద్ర జీవులు పునరుత్పత్తి దశలో ఉంటాయి. ఈ కాలంలో వేటాడితే మత్స్య సంపద తగ్గిపోతుంది. దీంతో ఈ కాలంలో సముద్ర వేటను ప్రభుత్వం నిషేధించింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు నిషేధం అమలులో ఉంటుంది.
ప్రభుత్వం ఆదుకోవాలి
'కరోనా ప్రభావంతో కొన్ని రోజులుగా చేపల వేటకు వెళ్లడం లేదు. లాక్‌డౌన్ కాలం పెరగడం.. సముద్రంలో చేపల వేట నిషేధంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. 2 నెలలు పూర్తిగా చేపల వేటకు దూరంకాక తప్పదు. ఈ దశలో ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.'- మత్స్యకారులు, పీఎం. లంక
ఇవీ చదవండి.. కృష్ణా జిల్లాలో తుది దశకు చేరిన 'కరోనా' సర్వే