ఏలూరులో అస్వస్థతకు గురైన వారి సంఖ్య 561కి చేరింది. ఇప్పటివరకూ 450 మంది పూర్తిగా కోలుకుని డిశ్ఛార్జి అయినట్టు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. 29 మందిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించినట్టు వెల్లడించింది. ఇ-కొలి లాంటి బ్యాక్టీరియాల పరిశీలనకు 22 నీటి నమూనాలను విశ్లేషిస్తే బ్యాక్టీరియా పరిమిత స్థాయిలోనే ఉందని అయితే పురుగుమందుల అవశేషాలు వెలుగు చూసినట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
మొత్తం 62 రక్త నమూనాల్లో పది శాంపిళ్లలో పరిమితికి మించి నికెల్, సీసం లాంటి భారలోహాలు ఉన్నట్టుగా తేలిందని ప్రభుత్వం తెలియజేసింది. లోతైన విశ్లేషణ కోసం దిల్లీలోని ఎయిమ్స్‌కు మరో 40 నమూనాలు పంపించినట్టు స్పష్టం చేసింది. వెన్నెముక నుంచి తీసిన నమూనాలలోనూ కల్చర్ టెస్టుల్లోనూ వైరస్, బ్యాక్టీరియా ఆనవాళ్లు లేవని వెల్లడించింది. ప్రస్తుతం కణజాల పరీక్ష కోసం సీసీఎంబీకి, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి కూరగాయల నమూనాలను పంపించారు. వీటి వివరాలు రావాల్సి ఉందని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా 'భారత్ బంద్'కు భారీ స్పందన