హుజూరాబాద్ ఉప ఎన్నికలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. నిరుద్యోగ దీక్షలో భాగంగా తెలంగాణలోని కరీంనగర్ జిల్లా సిరిసేడులో ఆత్మహత్య చేసుకున్న షబ్బీర్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న షర్మిలకు షబ్బీర్ కుటుంబసభ్యులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు కేవలం తమ సామర్థ్యాలను నిరూపించుకోవడానికే తీసుకొచ్చారని షర్మిల దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే వారిని ప్రజలు నిలదీయాలని సూచించారు. నిజామాబాద్‌లో ఎలాగైతే పసుపు రైతులు పోటీ చేసి తెరాసను ఓడించారో.. హుజూరాబాద్‌లోనూ అలాగే తెరాసను ఓడించాలని తెలిపారు. అప్పుడే నిరుద్యోగుల బాధ తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న భాజపా.. ఎప్పుడు ధర ఎక్కువ పలికితే అప్పుడు అమ్ముడుపోయే కాంగ్రెస్‌ను ఉప ఎన్నికల్లో నిలదీయాలన్నారు.
త్వరలో హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. పగలూ, ప్రతికారాల కోసం ఈ ఎన్నికలొస్తున్నాయి. బలాబలాలను నిరూపించుకునేందుకు ఈ ఉప ఎన్నికలొస్తున్నాయి. ఈ ఎన్నికలతో ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా అని ఓసారి ఆలోచన చేయండి. ఓట్ల కోసం వచ్చే నాయకులను నిలదీయండి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన మేరకు ఉద్యోగాలిచ్చుంటే.. ఈరోజు మన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకునేవారా? -వైఎస్ షర్మిల,వైఎస్ఆర్టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు
ఇదీ చదవండి: