మంత్రి పేర్నినాని...
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎవరి ప్రలోభాలకు లొంగకుండా.. ఎన్నికల వాయిదాపై పునరాలోచించాలని.. మంత్రి పేర్ని నాని కోరారు. భాజపా, జనసేన .. తెలుగుదేశానికి తోకపార్టీల్లా మారాయన్నారు. ఎవరి హయాంలో ఎక్కువ హింస జరిగిందో చర్చకు సిద్ధమన్న నాని.. లోకేశ్‌ను సర్పంచ్‌గా పోటీచేసి గెలిపించుకోవాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు.
ఎమ్మెల్యే జోగి రమేష్...
రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ పేరుతో వాయిదా వేయడం దుర్మార్గపు చర్య అని వైకాపా ఎమ్మెల్యే జోగిరమేష్ ఆరోపించారు. వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎన్నికల కమిషనర్‌గా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసేవారు కాదని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రలోభాలతో... వ్యవస్థలను దిగజారుస్తున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్యే చిట్టిబాబు...
రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం సరైన నిర్ణయం కాదని తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు అన్నారు. ఎన్నికలను వాయిదా వేయటం వల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయన్నారు. చంద్రబాబు కనుసన్నల్లోనే ఎన్నికల సంఘం వ్యవహరించిందని ఎమ్మెల్యే చిట్టి బాబు విమర్శించారు.
దాడిశెట్టి రాజా..
కరోనా వైరస్ వల్ల ఎన్నికలు వాయిదా వేయలేదని.. కేవలం నారా వైరస్ వాళ్లే ఎస్ఈసీ ఎన్నికలను వాయిదా వేసిందని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఆరోపించారు. చంద్రబాబు వ్యవస్థలను నాశనంచేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలు వాయిదా వేస్తే రాష్ట్రానికి రావాల్సిన రూ. 5 కోట్లు రాష్ట్ర ప్రజలు నష్టపోతారని తెలిపారు.
ఇవీ చదవండి: కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి...