ఎంపీ రఘురామకృష్ణరాజు, ఆయన కంపెనీలపై సీబీఐ దర్యాప్తు వేగవంతం చేయాలని వైకాపా ఎంపీలు రాష్ట్రపతి, ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఆయన్ను మరో విజయమల్యాగా మారకుండా విచారణ వేగం చేసి.. తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఎంపీలంతా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీలకు విడివిడిగా లేఖలు రాశారు. రఘురామరాజు కంపెనీలైన ఇండ్-భరత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్, ఆర్కే ఎనర్జీ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు.. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్, సంస్థల నుంచి తప్పుడు సమాచారంతో రూ.941.71 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు.
ఈ వ్యవహరంపై ఇప్పటికే సీబీఐ నమోదు చేసిన మూడు ఎఫ్‌ఐఆర్‌లలో దర్యాప్తు ముమ్మరం చేయాలని విజ్ఞప్తి చేశారు. విచారణను ఆలస్యం చేస్తే ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోతుందన్నారు. ఎంపీ సహా.. ఆయనకు చెందిన సంస్థల డైరెక్టర్లను దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించాలని కోరారు. బ్యాంకులను మోసం చేసి, తప్పుడు పద్దతుల్లో తీసుకున్న రుణాలను వసూలు చేయాలని, కస్టోడియల్ విచారణ చేపట్టి.. భారీ కుంభకోణంలో బాగస్వాములైన డైరక్టర్లను ప్రశ్నించి వాస్తవాలు వెలికితీసేలా దర్యాప్తు చేయించాలని రాష్ట్రపతి, ప్రధానిలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:
CM JAGAN CASES: 'సీబీఐ కేసులతో సంబంధం లేకుండా విచారించొచ్చు'