ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు నామినేషన్లే వేయకుండా అధికార పార్టీ అడ్డుకుందన్న ఆరోపణలు నడుమ రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, నగర పంచాయతీల పరిధిలోని 159 వార్డులు ఏకగ్రీవం కానున్నాయి. ఇవన్నీ వైకాపా సొంతం కానున్నాయి. పులివెందుల, మాచర్ల పురపాలక సంఘాలు ఏకగ్రీవంగా అధికార పార్టీ హస్తగతం కానున్నాయి. రాయచోటి పురపాలక సంఘమూ వైకాపా సొంతం కానుంది. పరిశీలన ప్రక్రియలో భాగంగా పలుచోట్ల ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థుల నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరణకు గురికావటంతో వారు పోటీకి అర్హత కోల్పోయారు. కొంతమంది ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుని అధికార పార్టీలో చేరిపోయారు. బరిలో ఉన్న అభ్యర్థులను తీవ్రంగా బెదిరించారని, ప్రలోభాలకు గురిచేసి తెరవెనుక ఒప్పందాలు కుదుర్చుకున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యే నాటికి ఏకగ్రీవాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.
గుంటూరు జిల్లా మాచర్లలో 31 వార్డులు ఉండగా.. ఇవన్నీ వైకాపాకే ఏకగ్రీవం కానున్నాయి. 25 స్థానాల్లో కేవలం వైకాపా అభ్యర్థులే నామినేషన్లు వేశారు. వేరే ఏ పార్టీ నుంచి పోటీ లేదు. మిగతా 6 వార్డుల్లో వైకాపా అభ్యర్థులపై పోటీగా తెదేపా కండువాలతో కొంతమంది శుక్రవారం నామినేషన్ వేశారు. అయితే అవసరమైన పత్రాలు సమర్పించలేదంటూ ఎన్నికల అధికారులు వాటిని పక్కన పెట్టారు. దీనివల్ల ఇక్కడ వైకాపాకే ఏక్రగీవం కానుంది.
తిరుపతి, పుంగనూరు, పలమనేరుల్లో
చిత్తూరు జిల్లా పలమనేరులో 26 వార్డులకు గాను 10 ఏకగ్రీవం కానున్నాయి. ఆయా వార్డుల్లో తెదేపా అభ్యర్థులు వేసిన నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. పుంగనూరులో 31 వార్డులకు గాను 14 ఏకగ్రీవం కానున్నాయి. తిరుపతిలో 8 డివిజన్లు వైకాపాకు ఏకగ్రీవం కానున్నాయి.
తూర్పులోనూ అధికంగానే
- అమలాపురంలో 11, 14, 16, 17, 25వ వార్డులు ఏకగ్రీవం కానున్నాయి. 14వ వార్డు తెదేపా అభ్యర్థి భార్య వైకాపాలో చేరటంతో ఆయన నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఆ స్థానం ఏకగ్రీవం కానుంది.
- తునిలో 1, 10, 13, 14, 22, 26 వార్డులు ఏకగ్రీవం కానున్నాయి.
అనంతపురం జిల్లాలో..
- అనంతపురం జిల్లా ధర్మవరంలో 27, 32, 37వ వార్డుల్లో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు. ఈ మూడు చోట్ల తెదేపా అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు.
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన పులివెందుల పురపాలక సంఘంలో 33 వార్డులకు 51 నామినేషన్లు దాఖలు కాగా..వాటిల్లో 44 వైకాపా అభ్యర్థులవే. 7 నామినేషన్లు స్వతంత్రులవి. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులెవరూ పోటీలో లేరు. వార్డులన్నీ వైకాపాకు ఏకగ్రీవం కానున్నాయి. రాయచోటిలో 34 స్థానాలుండగా.. వాటిల్లో 25 స్థానాలు వైకాపాకు ఏకగ్రీవం కానున్నాయి. కడపలో 50 స్థానాలకు గాను 12 వైకాపాకు ఏకగ్రీవం కానున్నాయి.
ఇదీ చదవండి