YCP GADAPA GADAPAKU: గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల ఇళ్ల వద్దకు వెళుతున్న వైకాపా ఎమ్మెల్యేలు బుధవారం సైతం కొన్నిచోట్ల నిరసనలను ఎదుర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా: అన్ని వస్తువుల ధరలు పెరగడంపై శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పెద్దమురహరిపురంలో మంత్రి అప్పలరాజును నిలదీశారు. ‘అమ్మా నీకు అమ్మఒడి అందుతుంది కదా...’ అని ఓ మహిళను మంత్రి వాకబు చేయగా... ‘అమ్మఒడి అందితే సరిపోతుందా? ధరలు విపరీతంగా పెంచేశారు. సామాన్యులం ఎలా బతుకుతాం’ అంటూ నిలదీశారు. గత ప్రభుత్వంలో పింఛను వచ్చేదని, ప్రస్తుతం రావడంలేదని ఓ వృద్ధురాలు సైతం మంత్రి ఎదుట వాపోయారు. స్పందించిన మంత్రి సచివాలయ ఉద్యోగుల తీరుపై అసహనం వ్యక్తంచేశారు.
శ్రీసత్యసాయి: జిల్లాలోని నల్లచెరువు మండలం పి.కొత్తపల్లి, పోలేవాండ్లపల్లిలో కదిరి ఎమ్మెల్యే పి.వి.సిద్ధారెడ్డి ఎదుటే ఓ రైతు అధికారులు, నాయకులను నిలదీశారు. తన భూమికి పట్టాదారు పాసుపుస్తకాల కోసం తహసీల్దార్ కార్యాలయం, నాయకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని పి.కొత్తపల్లికి చెందిన మహేశ్వరరెడ్డి… అనే రైతు వాపోయారు. దాంతో కొందరు నాయకులు, అధికారులు ఆయన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రైతు స్పందిస్తూ... సమస్యల పరిష్కారానికే కార్యక్రమం చేస్తున్నప్పుడు మా సమస్యలు చెప్పుకోనివ్వకపోతే గ్రామాల్లోకి ఎందుకు వస్తున్నారంటూ నిలదీశారు. ఎమ్మెల్యే స్పందిస్తూ సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
విశాఖ: ‘ఆరు నెలలుగా అద్దె చెల్లించడం లేదు. ఇంకో నెల చూస్తా. అప్పటికీ ఇవ్వకుంటే వార్డు సచివాలయాలకు తాళాలు వేస్తా’ అంటూ విశాఖ నగరంలోని విశాలాక్షినగర్‌లో ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, స్థానిక కార్పొరేటర్ కోరుకొండ వెంకటరత్న స్వాతి తదితరుల ఎదుట ఆయన తన సమస్యను ప్రస్తావించారు. రాజేశ్వరి అనే మహిళ తనకు జగనన్న చేదోడు, జగనన్న చేయూత అందలేదని ఫిర్యాదు చేశారు.
'గడప గడపకు-మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని... రాష్ట్ర వ్యాప్తంగా... అధికార పార్టీ నాయకులు నిర్వహించారు. ఆయా జిల్లాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించి... ప్రభుత్వ పథకాల పనితీరును ప్రజల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం ముషిడిపల్లిలో.... గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు , ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం నల్లగుంట్లలో మంత్రి ఆదిములపు సురేష్ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు గురించి వివరించారు. పలు చోట్ల ప్రజలు తాము పడుతున్న ఇబ్బందులపై ప్రశ్నించడంతో.. నేతలు ఇబ్బందులు పడ్డారు.
ఇవీ చదవండి: