సీఎం జగన్ రోజుకో దుష్ట సంప్రదాయంతో రాష్ట్ర ప్రజల ప్రతిష్ట, లౌకిక విలువలు దిగజారుస్తున్నారని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఈ నెల 18న శారదాపీఠం స్వామీ స్వరూపానంద పుట్టిన రోజు పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా 23 దేవాలయాల నుంచి ఆలయ మర్యాదలు, కానుకలు పంపాలన్న దేవాదాయ శాఖ ఆదేశాలను ఆయన ఖండించారు.
జగన్ తన స్వామి భక్తి కోసం 5 కోట్ల ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపర్చడం హేయమన్నారు. దేవాలయాలు, స్వామీజిల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పాటించే సంప్రదాయాలకు ఈ ఆదేశాలు వ్యతిరేకమన్నారు. ఇప్పటికే శారదా పీఠంపై అనేక వివాదాస్పద కథనాలు వస్తున్న వేళ.. దేవాదాయ శాఖ తీరు సరైన విధానం కాదన్నారు. స్వామిపట్ల భక్తి ఉంటే సొంత ఖజానా నుంచి కానుకలు ఇవ్వాలి తప్ప అధికారం దుర్వినియోగం ఏంటని ప్రశ్నించారు. అధికార యంత్రాంగాన్నంతటినీ ఒక ప్రైవేటు పీఠం ముందు మోకరిల్లజేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇతర స్వామీజిల పుట్టినరోజులకు లేని ఆలయ మర్యాదలు స్వరూపానందకు ఇవ్వడం ఇతర స్వామీజిలను, పీఠాలను కించపర్చడమేనని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.
ఇదీ చదవండి: అడగకుండానే సలాం కుటుంబానికి పాతిక లక్షలు ఇచ్చాం: హోంమంత్రి