Yadadri Maha Kumbha Samprokshanam: తెలంగాణలోని యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి మూలవిరాట్ దర్శనానికి అనుమతిస్తామని యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. 28న పూర్ణాహుతి తర్వాత ఉదయం 11.50 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ చేపడతామని వివరించారు. మహాకుంభ సంప్రోక్షణ అనంతరం పూజా కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. పూజల సమయంలో దర్శనానికి భక్తులను అనుమతించడం లేదని ఈవో స్పష్టం చేశారు. ఆ రోజు మధ్యాహ్నం తర్వాతే భక్తులకు దర్శనానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
అన్ని ఏర్పాట్లూ పూర్తి..
Sudarshan Maha yagam: 21 వ తేదీ నుంచి ఆలయ ప్రాంగణలో శ్రీ సుదర్శన నారసింహ యాగం నిర్వహిస్తున్నట్లు ఈవో వెల్లడించారు. ఆరోజు ఉదయం 9 గంటలకు అంకుర్పారణతో యాగం ప్రారంభం కానున్నట్లు తెలిపారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పూజా కార్యక్రమాలు ఉంటాయని.. సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 వరకు యాగాలు జరుగుతాయని వివరించారు. యాగశాలల నిర్మాణం రేపటికి పూర్తవుతుందని ఈవో తెలిపారు. పండితులు, అర్చకులు యాదాద్రి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈనెల 20 నాటికి అర్చకులు ఆలయం చేరుకుంటారని.. జపాలు, పారాయణాల కోసం ప్రధానార్చకులు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. స్వామివారికి కైంకర్యాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
"ఈనెల 28న యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ జరుగుతుంది. మహాకుంభ సంప్రోక్షణ అనంతరం పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాతే భక్తుల దర్శనాలకు అనుమతి ఉంటుంది. పూజా కార్యక్రమాల సమయంలో ఎవరికీ అనుమతి లేదు. 21 వ తేదీ ఉ.9 గంటలకు అంకురార్పణతో సుదర్శన మహాయాగం ప్రారంభం అవుతుంది. రోజూ ఉ.9 నుంచి మ.12.30 వరకు పూజా కార్యక్రమాలు ఉంటాయి. రోజూ సా.6 నుంచి రాత్రి 8.30 వరకు యాగాల నిర్వహణ ఉంటుంది." -గీతా రెడ్డి, ఆలయ ఈవో
ఆర్జిత సేవలు రద్దు..
సుదర్శన మహాయాగం సందర్భంగా బాలాలయంలో సుదర్శన హోమం, కల్యాణం, ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఈవో గీతా రెడ్డి పేర్కొన్నారు. భక్తులు పాతగుట్ట ఆలయంలో ఆర్జిత సేవలు నిర్వహించుకోవాలని.. ఈనెల 21 నుంచి యాగశాలలో స్వామివారి దర్శనానికి అనుమతి ఉంటుందని చెప్పారు. బాలాలయంలో స్వామివారి దర్శనాలు ఆపడం లేదని.. 27 వరకు యథావిధిగా దర్శనాలు ఉంటాయని వివరించారు.
ఇదీ చదవండి: