'ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం' ఏళ్లు గడుస్తున్నా ఇది మాటలకే పరిమితమవుతోంది తప్ప చేతల్లో మాత్రం సాధ్యం కావట్లేదు. లింగ అసమానత, లైంగిక వేధింపులు, వివక్షాపూరిత ధోరణి, ప్రోత్సాహం కొరవడడం.. వంటివి ప్రతి చోటా మహిళల అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నాయి. అయినప్పటికీ ప్రతి రంగంలో ఎదురవుతోన్న ఇలాంటి అడ్డంకుల్ని తొలగించుకుంటూ అడుగు ముందుకేయడానికే మొగ్గు చూపుతున్నారు ఈ తరం అతివలు. ఇలా తమ విజయంతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అయితే ఆయా రంగాల్లో మహిళలకు కొన్ని విషయాల్లో చేయూతనందిస్తే చాలు.. వారు ఈ పురుషాధిక్య ప్రపంచాన్ని స్త్రీ-పురుష సమానత్వ ప్రపంచంగా మార్చగలరని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు.. అది వారికి వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదిగే సదవకాశాన్ని సైతం అందిస్తుందని చెబుతున్నారు. మరి, ఈ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవా’న్ని పురస్కరించుకొని ప్రస్తుతం ఆయా రంగాల్లో మహిళల పాత్ర ఎలా ఉంది? పురుషులకు దీటుగా రాణించాలంటే ఏయే అంశాల్లో వారికి ప్రోత్సాహం అందించాలి? తదితర విషయాల గురించి తెలుసుకుందాం రండి..
సమాన వేతనం దక్కాలి!
ఉద్యోగుల దగ్గర్నుంచి కంపెనీల సీఈవోల దాకా.. స్వయం ఉపాధి మొదలు పెద్ద పెద్ద వ్యాపారాల దాకా.. ఇలా ఆయా కంపెనీల్లో మహిళల శాతం తక్కువగా ఉన్నప్పటికీ తమదైన నైపుణ్యాలతో వారు తమ సత్తా చాటుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో కొన్ని చోట్ల మహిళలు పురుషులతో పోటీ పడి పనిచేసినా వేతనాల దగ్గరికి వచ్చే సరికి మాత్రం ఆ వ్యత్యాసం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. పైగా పనిచేసే చోట వివక్ష, సరైన ప్రోత్సాహకాలు లేకపోవడం, లైంగిక వేధింపులు.. వంటివన్నీ వారి అభివృద్ధికి ఆటంకాలుగా మారుతున్నాయంటున్నారు నిపుణులు. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో నుంచి మహిళలు బయటపడి నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకోవాలంటే అటు మహిళలు, ఇటు కంపెనీలు పలు అంశాల్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.
- పురుషులతో సమానంగా పనిచేస్తున్నప్పుడు వేతనం కూడా సమానంగా తీసుకోవడం మన హక్కు. కాబట్టి అందుకోసం డిమాండ్ చేయడంలో తప్పులేదు.
- పుట్టిన బిడ్డ ఆలనా పాలన చూసుకోవడం కేవలం తల్లికే కాదు.. అందులో తండ్రికి కూడా బాధ్యత ఉంటుంది. అందుకే కొత్తగా తండ్రైన వారికి సైతం సెలవులిచ్చేలా కంపెనీలు కొత్త విధివిధానాలను రూపొందించాలి.
- పనిచేసే చోట ఎదురయ్యే లైంగిక వేధింపులు, హింసకు వ్యతిరేకంగా కంపెనీలు కఠినమైన విధివిధానాలను రూపొందించాలి.
- ఇంటి పనుల్లో, బాధ్యతల్లో భార్యాభర్తలిద్దరూ సమానంగా పాలు పంచుకోవాలి.
- బోర్డు రూముల్లో మహిళలకూ సమప్రాధాన్యం కల్పించాలి.
ఆటల్లో అసమానతలొద్దు!
ఒకప్పుడు కొన్ని క్రీడలకు మాత్రమే పరిమితమైన మహిళలు ఇప్పుడు దాదాపు అన్ని ఆటల్లోనూ రాణిస్తూ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో ఎదురైన సవాళ్లను ఓర్పుతో, నేర్పుతో ఎదుర్కొంటూ ఎంతోమంది ఔత్సాహిక క్రీడాకారుల్లో స్ఫూర్తి రగిలిస్తున్నారు. ఇలా ఆటల విషయంలో చూస్తే మహిళలకు కూడా పురుషులతో సమాన అవకాశాలు దక్కుతున్నాయనే చెప్పుకోవాలి. ఇందుకు రాబోయే టోక్యో ఒలింపిక్స్ ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవాలి. ఎందుకంటే అందులో సుమారు 49 శాతం మంది మహిళా అథ్లెట్లు చోటు దక్కించుకున్నారు. అలాగని అన్ని క్రీడల్లో పురుష అథ్లెట్లతో సమానంగా మహిళా అథ్లెట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్నారా అంటే.. లేదనే అంటున్నారు నిపుణులు. ఇదొక్కటనే కాదు.. క్రీడల్లో అమ్మాయిలు పూర్తి నాయకత్వ ప్రదర్శన చేయాలంటే ఈ అంశాలు దోహదం చేస్తాయి.
- ఏ క్రీడలోనైనా లింగభేదం లేకుండా అమ్మాయిల్ని ప్రోత్సహించడం, వారిలో ఆ ఆట పట్ల అవగాహన పెంచడం తల్లిదండ్రుల బాధ్యత.
- మహిళలకు పురుషులతో సమానంగా రెమ్యునరేషన్ చెల్లించడంతో పాటు సమాన ప్రైజ్‌మనీ దక్కేలా చూడాలి.
- పురుషుల ఆటను ఎలాగైతే ప్రోత్సహిస్తామో.. మహిళల ఆటను చూడడానికి, ఆ క్రీడాకారిణుల్ని ప్రోత్సహించడానికీ అంతే ప్రాధాన్యమివ్వాలి.
- లింగభేదం లేకుండా మహిళా అథ్లెట్ల విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి.
భయమెందుకు?!
శాస్త్రసాంకేతిక రంగాలంటే చాలామందిలో ఏదో తెలియని భయం ఉంటుంది. అది చాలా కఠినమైన రంగం, మా వల్ల కాదంటూ వాటిని తమ కెరీర్‌గా ఎంచుకోవడానికి వెనకాడే వారూ లేకపోలేదు. ఇలాంటి అరుదైన రంగాల్లోనూ పలువురు మహిళలు సత్తా చాటుతున్నారు. ఇంజినీర్లుగా, గణిత మేధావులుగా, శాస్త్రవేత్తలుగా అంతరిక్షంలోకి వ్యోమనౌకల్ని పంపించడం దగ్గర్నుంచి వైద్య రంగంలో పరిశోధనలు చేయడం దాకా.. ఇలా ప్రతి విభాగంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. మరింతమంది ఈ రంగాన్ని ఎంచుకునేలా వారిలో స్ఫూర్తి నింపుతున్నారు. ఇక ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఎంతోమంది మహిళలు వైద్యులు, నర్సులుగా సేవలందించడంతో పాటు, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలోనూ పాలుపంచుకుంటూ కొవిడ్ వారియర్స్‌గా పేరు తెచ్చుకుంటున్నారు. మరింతమంది మహిళల్ని ఈ దిశగా ప్రోత్సహించాలంటే..!
- శాస్త్రసాంకేతిక రంగాలపై ఉండే భయాన్ని పిల్లల్లో విద్యార్థి దశ నుంచే తొలగించే ప్రయత్నం చేయాలి.
- ఈ రంగంలో నిపుణులైన మహిళల సలహాలు, అనుభవాలను తెలుసుకోవడం, వారి విజయగాథల్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగేలా అమ్మాయిల్లో ప్రోత్సాహం నింపాలి.
- సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం రంగాల్ని ఎంచుకునేలా మహిళలే ఇతర మహిళలు, బాలికల్లో స్ఫూర్తి నింపాలి.
మహిళలే నాయకులై..!
అన్ని రంగాల్లో లాగే ప్రపంచ రాజకీయాల్లో కూడా మహిళల పాత్ర తక్కువగానే ఉందని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా కేవలం 22 దేశాల్లో మాత్రమే మహిళలు ప్రభుత్వ అధినేతలుగా కొనసాగుతున్నారట! అంతేకాదు.. 25 శాతం మంది మహిళలు మాత్రమే ఆయా దేశాల పార్లమెంట్లలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక ఆయా దేశాల్లోని రాష్ట్రాల విషయానికొస్తే.. 36 శాతం మంది మహిళలు మాత్రమే చట్టసభల్లో చోటు దక్కించుకుంటున్నారు. ఇలా రాజకీయాల్లో మహిళల పాత్ర తగ్గడం కారణంగా మహిళా సమస్యలు అలాగే మరుగున పడిపోతున్నాయి.. రాజకీయాల్లో మహిళా ప్రాధాన్యం పెంచకుండా ఈ పరిస్థితిని ఇలాగే కొనసాగిస్తే ఈ రంగంలో లింగ సమానత్వం సాధ్యం కావడానికి మరో 130 ఏళ్లు పట్టడం ఖాయమంటున్నారు నిపుణులు. అలా జరగకూడదంటే..
- రాజకీయాల్లో మహిళల ప్రాతినిథ్యం పెంచాలి.
- ప్రజా జీవనంలో, రాజకీయాల్లో పాలుపంచుకునేలా మహిళల్ని ప్రోత్సహించడం, వారికి తగిన శిక్షణ అందించడం.. వంటివి చేయాలి.
- రాజకీయాల్లో మహిళలపై జరిగే హింసకు అడ్డుకట్ట వేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
- మహిళా అభ్యర్థుల ప్రచారాన్ని, వారి నాయకత్వాన్ని ప్రోత్సహించాలి.
‘రైతే రాణి’ కావాలంటే..!
‘పంటలు పండించగలం.. దేశాన్ని పోషించగలం..’ అంటూ వ్యవసాయ రంగంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు అతివలు. మహిళలకు సంబంధించిన ఉపాధి రంగాల్లో మూడింట ఒక వంతు మంది స్త్రీలు వ్యవసాయంలోనే కొనసాగుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అయినప్పటికీ వారికి సరైన వనరులు సమకూర్చుతూ వారిని ఈ దిశగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- వ్యవసాయ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులపై గ్రామీణ మహిళల్లో అవగాహన పెంచాలి.
- మహిళా రైతుల్ని ప్రోత్సహించే స్థానిక సంస్థలకు తగిన ప్రోత్సాహకాలు అందించాలి.
- మహిళలు పండించే పంటలు, వారు స్థానికంగా నిర్వహించే ఫామ్స్ నుంచి సరుకును కొనుగోలు చేస్తూ వారిని ప్రోత్సహించాలి.
- మహిళా రైతులకు సరైన వ్యవసాయ వనరుల్ని సమకూర్చుతూ, వారు పండించే భూములపై వారికి సంపూర్ణ హక్కును కల్పించాలి.
- గ్రామీణ మహిళా రైతులు తమ సమస్యల్ని నిర్మొహమాటంగా పంచుకునేలా వారిని ప్రోత్సహించాలి.
ఇలా వీటితో పాటు వినోదం, మీడియా, శాంతి భద్రతలు, పర్యావరణ పరిరక్షణ.. తదితర విషయాల్లో కూడా మహిళల ప్రాతినిథ్యం పెంచుతూ, వారి నిర్ణయాలను స్వీకరించి అమలు పరిస్తే ఇటు ఆయా దేశాలు అభివృద్ధి పథంలో పయనించడంతో పాటు అటు మహిళా సాధికారత కూడా సాధ్యపడుతుంది. మరి, ఆయా రంగాల్లో మహిళా ప్రాధాన్యం పెంచుతూ వారిని అభివృద్ధి పథంలో నడిపించాలంటే ఇంకా ఎలాంటి అంశాలు దోహదం చేస్తాయంటారు.
హ్యాపీ విమెన్స్ డే!
ఇదీ చదవండి: వ్యక్తిగత బాగోగుల విషయంలో వెనకబడిపోతే ఎలా...?