అమరావతి ఆకాంక్షకు మొదటినుంచీ మహిళా చైతన్యమే ఆసరాగా నిలిచింది. మందడం, వెలగపూడి, తుళ్లూరు, రాయపూడి, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, పెనుమాక, ఐనవోలు ఇలా ఏ దీక్షా శిబిరం చూసినా స్త్రీలే అడుగడుగునా సారథులుగా నిలిచారు. ఉద్రిక్త పరిస్థితుల్లో పోలీసుల లాఠీ దెబ్బలు, బాధలను పంటి బిగువనే ఓర్చుకున్నారు.
మందడం రహదారి దిగ్బంధనం, కనకదుర్గ అమ్మవారి వద్దకు కాలినడకన వెళ్లి మొక్కు చెల్లించుకొనే క్రమంలో పోరాట స్ఫూర్తి ప్రదర్శించారు. తుళ్లూరు నుంచి మందడం వరకూ రైతులు చేపట్టిన మహా కవాతులో ముందువరుసలో నిలిచారు. సచివాలయం, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాల్లోనూ కీలక పాత్ర పోషించారు.
ఓవైపు ఇళ్లలో అన్ని పనులు చక్కబెడుతూనే... దీక్షా శిబిరాలకు క్రమం తప్పకుండా హాజరయ్యారు. పూజలు, జలదీక్షలు, వంటా వార్పు, సాయంత్రం వేళ కాగడా ప్రదర్శనలు వంటి నిరసనలతో తొలి రోజు నుంచీ అమరావతి గళాన్ని బలంగా వినిపించారు. అమరావతి ఉద్యమాన్ని కించపరిచే నేతలకు ఎప్పటికప్పుడు మహిళలే గట్టిగా బదులిచ్చారు.
రాజకీయ, ఆధ్యాత్మిక, సినీ ప్రముఖులు సైతం తరలివచ్చి మహిళా శక్తిని కొనియాడారు. దిల్లీ సైతం వెళ్లిన అమరావతి అతివలు కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల జాతీయ నాయకులకు తమ ఆవేదనను తెలిపారు. రాజధాని గ్రామాల మహిళలకు విజయవాడ, గుంటూరు అతివలు సైతం అండగా నిలిచారు. వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు. గుంటూరు, తెనాలి ప్రాంతాల్లో నిరసనలను విజయవంతం చేశారు.
ఇదీ చదవండీ... రాజధాని గ్రామాల్లో పర్యటించనున్న నారా లోకేశ్