Women in Automobile industry : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని టాటా మోటార్స్ షోరూంలో కేవలం మహిళా ఉద్యోగులనే నియమించారు. సేల్స్ మేనేజర్ దగ్గర నుంచి వాచ్‌మెన్ వరకు అతివలే దర్శనమిస్తున్నారు. ఆటోమొబైల్ రంగంపై ఆసక్తి ఉండడంతో పాటు ప్రతిభ కలిగిన వారికి పోత్సాహం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు యాజమాన్యం పేర్కొంది. ఉద్యోగులకు వారంలో రెండ్రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
Women in Telangana Automobile industry : ఇందులో పనిచేసే ఉద్యోగులు రాత్రి ఏడున్నర లోపు విధులు ముగించుకునే వెసులుబాటు కల్పించారు. ఇలాంటి సంస్థలో పనిచేయటం పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. అతివలు తక్కువగా ఉంటారని భావించే ఆటోమొబైల్ రంగంలోనూ పూర్తిస్థాయిలో వారికే అవకాశం కల్పించారు. దక్షిణాదిలో తీసుకువచ్చిన ఈ మొదటి షోరూంని.. 20మంది మహిళలు నిర్వహిస్తున్నారు.
Telangana Women in Automobile industry : ఇక్కడ పనిచేసే ఉద్యోగులు అత్యంత ప్రతిభావంతులని మేనేజింగ్ డైరెక్టర్ సహృదయిని పేర్కొన్నారు. అందరితో కలుపుగోలుగా ఉంటూ విధి నిర్వహణలో చురుగ్గా వ్యవహరిస్తారని వెల్లడించారు. షోరూంలో వాహనాన్నింటిపై పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండి వినియోగదారులకు అర్థమయ్యేలా వివరిస్తారని ఆమె తెలిపారు. ఇతర చోట్ల పనిచేసేటప్పుడు కొన్నిసార్లు పురుషులతో కాస్త ఇబ్బందులు ఎదురయ్యేవని ఇప్పుడు ఆస్కారం లేదని మహిళా ఉద్యోగులు అన్నారు.
మహిళలందరూ సమష్టిగా పనిచేసే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. పూర్తిగా మహిళా షోరూం కావడంతో కార్లను కొనుగోలు చేసేందుకు కుటుంబ సభ్యులందరూ ఎక్కువగా వస్తున్నారని తెలిపారు. పిల్లలను ఆడించేందుకు ప్రత్యేకంగా ఆటవస్తువులను కూడా ఏర్పాటు చేశామని ఉద్యోగులు వెల్లడించారు. అమ్మాయిలకు ఇలాంటి అవకాశాలు మరిన్ని కల్పించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
"ఈ ఆలోచన మాకు ఎలా వచ్చిదంటే ప్రతి సంవత్సరం మహిళదినోత్సవం జరుపుతాం. ఆరోజు మాకు ఈ ఆలోచన వచ్చింది. దానిని మేము ఈవిధంగా దానిని అమలు చేశాం." -డాక్టర్ సహృదయిని, మేనేజింగ్ డైరెక్టర్
"ఆటోమొబైల్ అంటే అబ్బాయిలకు అనుకుంటారు. డోర్ తీసే దగ్గరి నుంచి కారు డెలీవరి వరకు అందరూ మహిళలే ఉన్నారు. ఇక్కడ మాకు చాలా బాగుంది."- నిరోషా, సేల్స్ మేనేజర్