online trading cyber crime : ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరిని సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన రజత్ పతేరియా, అశ్విన్ బగాదారె.. ఆన్‌లైన్‌లో ట్రేడింగ్ చేస్తే మంచి లాభాలు వస్తాయంటూ ప్రచారం చేశారు. దిల్లీలోని వసంత్‌కుంజ్ ప్రాంతంలో కార్యాలయం ప్రారంభించారు. అనంతరం.. సాక్షి మెహతా పేరుతో ఉన్న ఫేస్ బుక్ ఖాతా ద్వారా.. డీమ్యాట్ ఖాతాలు ప్రారంభించాలని పోస్టు చేశారు. ఇది చూసిన ఓ హైదరాబాద్ మహిళ వారి మాటలు నమ్మి.. నిండా మునిగారు.
ఆ మహిళ తొలుత రూ.5లక్షలు ట్రేడింగ్ నిమిత్తం ఆన్‌లైన్ ద్వారా పంపింది. ఆ తర్వాత రూ.88 లక్షల ట్రేడింగ్‌లో లాభాలు వచ్చాయని మోసగాళ్లు మహిళకు తెలిపారు. లాభం వచ్చిన మొత్తాన్ని పొందాలంటే మరికొంత నగదు చెల్లించాలంటూ దశల వారీగా వివిధ బ్యాంకు ఖాతాల్లో మహిళ నుంచి రూ.1.20 కోట్ల దండుకున్నారు. తాను మోసపోయినట్టు గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.
కేసు నమోదు చేసిన పోలీసులు సైబర్ మోసగాళ్లిద్దరినీ అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడు సెల్ఫోన్లు, వివిధ బ్యాంకుల డెబిట్ కార్డులు, రూ.1,02,000 స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మధ్యప్రదేశ్‌లో కూడా కొంతమందిని మోసం చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇదీ చదవండి: ONLINE BETTING GANG ARREST: రెండింతలు ఆదాయమని మోసం.. ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా అరెస్టు