Habeas corpus petition: జగ్గంపేట పోలీసులు తన భర్త జక్కి శ్రీరామ్‌ను బలవంతంగా తీసుకెళ్లి.. కిడ్నాప్ చేశారని జగ్గంపేటకు చెందిన జక్కి సురేఖ హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈనెల 6న శ్రీరామ్‌ను జగ్గంపేట ఎస్ఐ.. ఒక సివిల్ తగాదాలో అకారణంగా నిర్బంధించారని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ తెలిపారు. సివిల్ వివాదంలో పోలీసులు అనవసరంగా జోక్యం చేసుకుని.. స్థానిక ఎమ్మెల్యే చెప్పిన విధంగా పిటిషనర్ భర్తని హింసిస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. నెలరోజులు గడుస్తున్నా తన భర్త ఆచూకీ తెలియకపోవడంపై పిటిషనర్ ఆవేదన పడుతున్నారని, పిటిషనర్ భర్తకి ప్రాణహాని ఉందన్నారు.
పోలీసులు తక్షణమే నిర్బంధించిన శ్రీరామ్‌ను కోర్టు ముందు ప్రవేశపెట్టే విధంగా పోలీసులను ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రవణ్ కుమార్ హైకోర్టును కోరారు. పిటిషనర్ ఆరోపించిన విధంగా ఎలాంటి నిర్బంధం చేయలేదని పోలీసు తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ అంశంపై విచారించి ప్రమాణ పత్రం దాఖలు చేయాలని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 22కి న్యాయస్థానం వాయిదా వేసింది.
ఇవీ చదవండి: