జూడాలతో వైద్యవిద్య సంచాలకులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమ డిమాండ్లపై తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించే వరకూ సమ్మె కొనసాగుతుందని రాష్ట్ర జూనియర్ వైద్యుల సంఘం బుధవారం అర్ధరాత్రి ప్రకటించింది. డీఎంఈతో చర్చల అనంతరం బుధవారం రాత్రి జూడాల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వాసారి నవీన్ ఈటీవీ భారత్‌తో మాట్లాడారు. గురువారం ఈ విషయంపై మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా బుధవారం ఉదయం నుంచే రాష్ట్రంలోని అన్ని బోధనాసుపత్రుల్లో అత్యవసరం మినహా మిగిలిన సేవలను జూడాలు బహిష్కరించారు. దీంతో రోగులు అవస్థలు పడ్డారు.
ముఖ్యంగా.. ఓపీ సేవల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ సమ్మె ప్రభావం వైద్యసేవలపై పడింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని గాంధీ, టిమ్స్, ఉస్మానియా, నిలోఫర్, సరోజనిదేవి తదితర ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఆటంకం ఏర్పడింది. గాంధీ ఆసుపత్రిలోని కొవిడ్, బ్లాక్‌ఫంగస్ రోగులకు రోజువారీగా అందే సేవల్లో ఇబ్బందులు తలెత్తాయి. ఉస్మానియాలో ఎంపిక చేసిన శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. రోగుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించడంలో కీలకమైన సీనియర్ రెసిడెంట్లు సమ్మెలో ఉండటంతో గచ్చిబౌలిలోని టిమ్స్‌లోనూ రోగులకు అవస్థలు తప్పలేదు.
సీఎం అత్యవసర భేటీ..
పరిస్థితి తీవ్రత తెలుసుకున్న సీఎం కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. జూడాల ప్రధాన డిమాండ్లలో ఒకటైన సీనియర్ రెసిడెంట్లకు 15 శాతం స్టైపండ్ పెంపు అంశాన్ని సత్వరమే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. విధుల్లో వెంటనే చేరాలని ముఖ్యమంత్రి కోరిన మీదట సాయంత్రం వైద్యవిద్య సంచాలకులతో జూడాల సంఘం ప్రతినిధులు చర్చలకు హాజరయ్యారు. బుధవారం మధ్యాహ్నం మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు సమ్మె విరమించాలని భావించామని, ఈ చర్చల్లో ఏ అంశాలపైనా సానుకూలత వ్యక్తం కాలేదని చర్చల అనంతరం వారు వెల్లడించారు.
‘‘కొవిడ్‌తో మృతిచెందిన వైద్య సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.50 లక్షల పరిహారానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్ట పరిహారం చెల్లించే అంశంపై హామీ లభించలేదు. నిమ్స్‌లో వైద్యసిబ్బందికి పడకల సౌకర్యం కల్పించడంపైనా స్పష్టత లేదు. కొవిడ్ వైద్య సిబ్బందికి 10 శాతం ప్రోత్సాహక నగదు ఇవ్వడంపైనా హామీ లభించలేదు’ అని జూడాల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నవీన్ తెలిపారు. తమ కోర్కెల పరిష్కారంపై ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కొనసాగించాలా? విరమించాలా?
ఈ పరిణామాల నేపథ్యంలో రాత్రి 11 గంటల వరకూ జూడాలతో వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. జూడాలు కూడా బుధవారం అర్ధరాత్రి వరకూ సమ్మెను కొనసాగించాలా? విరమించాలా? అనే విషయంపై అంతర్గతంగా చర్చలు కొనసాగిస్తూనే ఉన్నారు. సమ్మె కొనసాగించాలా? అనేది గురువారం వెల్లడిస్తామని చివరిగా ప్రకటించారు.
తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెలోకి...
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో సమ్మెకు దిగుతామంటూ ఈ నెల 10వతేదీ నోటీసు ఇచ్చినా సర్కారు నుంచి స్పందన లేదని తెలంగాణ జూనియర్ వైద్యుల సంఘం (టీజూడా) ఆవేదన వ్యక్తంచేసింది. బుధవారం మధ్యాహ్నం కోఠిలోని ఉస్మానియా వైద్య కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా.విజయ్, డా.సమీనా, గాంధీ యూనిట్ అధ్యక్షులు డా.మణికిరణ్ తదితరులు మాట్లాడారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో అత్యవసరం మినహా అన్ని సేవలను బహిష్కరించి సమ్మెకు దిగామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: