రాష్ట్రంలో ఉదయం పొగమంచు.. మధ్యాహ్నం ఎండలు మండుతున్నాయి. అనంతపురంలో రాత్రి ఉష్ణోగ్రత 18.2 డిగ్రీలుగా నమోదైంది. కృష్ణా జిల్లా నందిగామలో 18.6 డిగ్రీలు ఉంది. రాజధాని అమరావతి ప్రాంతంలోనూ రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయి. కొన్నిచోట్ల ఆదివారం ఉదయం 10 గంటల వరకు పొగమంచు ప్రభావం కనిపించింది. రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. విశాఖపట్నంలో రాత్రి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. అక్కడ 25 డిగ్రీల వరకు నమోదవుతోంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉన్నాయి. ఆదివారం గరిష్ఠంగా కర్నూలులో 38.5 డిగ్రీలు నమోదైంది. అనంతపురంలోనూ 38.1 డిగ్రీలు ఉంది. అత్యల్పంగా కళింగపట్నంలో 31.1, విశాఖపట్నంలో 31.2 డిగ్రీలు నమోదయ్యాయి. బుధ, గురువారాల్లో చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.
విమాన సర్వీసులకు అంతరాయం
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆదివారం తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో కొన్ని సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దిల్లీ, బెంగళూరు సర్వీసులు ఉదయం 7.20 గంటలకు గన్నవరం చేరుకోగా ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో గంటసేపు గాలిలో చక్కర్లు కొట్టాయి. తర్వాత వాతావరణం మెరుగుపడటంతో ల్యాండింగ్ అయ్యాయి.
ఇదీ చదవండి:
ప్రకాశం బ్యారేజీపై రాజధాని మహిళల కవాతు.... అడ్డుకున్న పోలీసులు