ఉల్లి ధరల విషయంలో తొలుత స్పందించింది ఏపీనే అని మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. దేశవ్యాప్తంగా ఉల్లి సరఫరా తక్కువగా ఉందని వెల్లడించారు. అధిక వర్షాలతో మహారాష్ట్ర వంటి చోట్ల పంట చేతికి రాక ఇబ్బందులు తలెత్తాయని పేర్కొన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మొదటగా సెప్టెంబర్ 27 నుంచి 6,739 క్వింటాళ్ల ఉల్లి ఎక్కువ ధరకు కొని... తొలి విడతలో కిలో ఉల్లి రూ.28కి సరఫరా చేశామని వివరించారు. మరో నెల ఇదే పరిస్థితి ఉంటుందని అనంతరం 36,566 క్వింటాళ్లు కొన్నామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం కిలో ఉల్లి రూ.25కే సరఫరా చేస్తున్నామని అన్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్, కర్నూలు నుంచి కిలో ఉల్లి రూ.120కి కొని రూ.25కే రైతు బజార్లలో ప్రజలకు ఇస్తున్నామని మోపిదేవి పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల కంటే ఆంధ్రాలోనే తక్కువ ధరకు ఉల్లి లభిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉల్లి కొనుగోలుకు ఇప్పటికే రూ.25.85 కోట్లు వెచ్చించామని వెల్లడించారు. నిత్యావసరాలపై భారం పడకుండా మార్కెట్ స్థిరీకరణ నిధి నుంచి చెల్లిస్తున్నామని వివరించారు. మరో నెల ఇదే పరిస్థితి ఉండొచ్చన్న మంత్రి... 2 వేల 500 మెట్రిక్ టన్నుల ఉల్లి కావాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.
ఇవీ చదవండి
ఉల్లి కోసం వచ్చి.. గుండెపోటుతో వ్యక్తి మృతి