రేపు తొలిదఫా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల వ్యవహారంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశమై చర్చించారు. రాజ్‌భవన్‌కు చేరుకున్న నిమ్మగడ్డ 11.30 గంటలకు గవర్నర్‌తో భేటీ అయ్యారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి అంశాలపై చర్చించారు.
నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ఎస్ఈసీ .. రేపు తొలి దఫా నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయిచింది. ఎన్నికల నిర్వహణ కోసం తాను తీసుకోబోతున్న చర్యలపై గవర్నర్‌తో ఎస్ఈసీ చర్చించారు. ఎన్నికల నిర్వహణకు పచ్చజెండా ఊపుతూ హైకోర్టు తీర్పు ఇచ్చిన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ ఉద్యోగులు నిరాకరిస్తున్నారని.. సహకరించేలా వారికీ ఆదేశాలివ్వాలని కోరినట్లు తెలిసింది.
గుంటూరు, చిత్తూరు కలెక్టర్లకు ఎన్నికల విధులు ఇవ్వడం లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. గతేడాది మార్చిలో స్థానిక ఎన్నికల నిర్వహణ సమయంలో పలుచోట్ల దౌర్జన్యాలు, దాడులను నివారించడంలో విఫలమయ్యారని.. విచారణ నివేదికల దృష్ట్యా వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
గవర్నర్‌తో సమావేశం అనంతరం నేరుగా ఎన్నికల కమిషన్ కార్యాలయానికి రమేశ్ కుమార్ వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు.. ఎస్ఈసీని కలవనున్నారు. ఎన్నికల కమిషనర్‌తో సమావేశానికి హాజరుకానున్న పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్.. తొలి దశ ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఎన్నికల రిజర్వేషన్లు, నామినేషన్ల అంశంపై సమాలోచనలు చేస్తారు. అలాగే సున్నిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా చర్చలు జరుపుతారు.
ఇదీ చదవండి: అంతుచిక్కని వ్యాధితో 21 మంది అస్వస్థత