స్థానిక ఎన్నికల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘంతో ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని పేర్కొంటూ ఇటీవల సూచించిన హైకోర్టు..అందుకు సంబంధించిన ఉత్తర్వులను వెల్లడించింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు అందిన మూడు రోజుల్లో ముఖ్య కార్యదర్శి హోదాకు తగ్గని ముగ్గురు అధికారులను ఎస్‌ఈసీ వద్దకు పంపించాలని చెప్పింది. ఇందుకోసం ఎన్నికల కమిషనే వేదికను నిర్ణయించాలని సూచించింది. ఈ భేటీలో ఎన్నికల నిర్వహణపై ఉన్న అభ్యంతరాలను ప్రభుత్వ అధికారులు.. ఎస్‌ఈసీ ముందుంచాలని స్పష్టం చేసింది. వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను ఎస్‌ఈసీ వివరించాలని ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంది.
ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. కరోనా కారణంగా మానవాళి మొత్తం అత్యంత క్లిష్టమైన, బాధాకర పరిస్థితిని ఎదుర్కొంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ అడ్వకేట్ జనరల్, రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది వాదనలు, సుప్రీంకోర్టు ఆదేశాల్ని పరిగణనలోకి తీసుకొని విస్తృత ప్రయోజనాల దృష్ట్యా..ఎన్నికల నిర్వహణ వ్యవహారంలో సామరస్యపూర్వకంగా సంప్రదింపులు జరపాలని కోరుతూ వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది.
ఎన్నికల నిర్వహణ వ్యవహారం పూర్తిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికార పరిధిలోనిదని..ఎన్నికల ఏర్పాట్లు చేసే విషయంలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలే తప్ప ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం నుంచి ముందస్తు సమ్మతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు ఎస్‌ఈసీ తరపు న్యాయవాది అశ్వనీకుమార్ చెప్పిన విషయాల్ని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. కరోనా విషయంలో కేంద్రప్రభుత్వం ఇచ్చిన సూచనలు, మార్గదర్శకాలు, వాదననను రాతపూర్వకంగా ఎస్ఈసీకి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయమూర్తి సూచించారు.
ఇదీ చదవండి: