విశాఖ ఎల్జీ సంస్థ ఘటన అటు అధికార యంత్రాంగ పర్యవేక్షణ ఇటు యాజమాన్య నిర్వహణ లోపాలను ఎత్తిచూపుతోంది. ఉపద్రవానికి కారణమైన స్టైరీన్రసాయనాన్ని 1996లోనే కేంద్ర ప్రభుత్వం ప్రమాదకర రసాయనాల జాబితాలో చేర్చింది. ఈ రసాయనం వల్ల ప్రమాదాలు, విపత్తులు సంభవించవచ్చని పేర్కొంది. అనంతరం అనేక సందర్భాల్లో రసాయన కర్మాగారాల విషయంలో అనుసరించాల్సిన ప్రామాణికాలను స్పష్టంగా నిర్దేశించింది. విశాఖ ఘటనతో మరోసారి... ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది.
నిబంధనలివే..!
అటవీ పర్యావరణ శాఖ చట్ట నిబంధనల ప్రకారం.. అత్యంత ప్రమాదకర విపత్తు సంభవించే యూనిట్లకు సంబంధించి ఇవి కచ్చితంగా పాటించాలి.
- యూనిట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.
- జనావాసాలకు దూరంగా ఉండాలి.
- ప్రతి కర్మాగారంలో ప్రమాదాన్ని పసిగట్టే అలారం వ్యవస్థ, లీక్ డిటెక్షన్ రాడార్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
- పరిశ్రమల నుంచి సమస్యలు రాకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక పర్యవేక్షక బృందాలు ఏర్పాటు చేయాలి.
- ముందస్తు భద్రతా ప్రణాళికలు రూపొందించి ఎప్పటికప్పుడు భద్రతా చర్యలు సమీక్షించుకోవాలి.
ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 300 జిల్లాల్లో సుమారు 1860 రసాయన కంపెనీలు ఉన్నాయి. వీటిలో నిబంధనలు అతిక్రమించిన చాలా కంపెనీలపై పలు సందర్భాల్లో స్థానిక యంత్రాంగాలు చర్యలు చేపట్టాయి. ఎల్జీ పాలిమర్స్ సంస్థ సైతం ఈ కోవకు చెందిందేనని అధికారులు గతంలోనే ధ్రువీకరించారు.
భద్రతా కసరత్తులతో మేలే
రసాయన కర్మాగారాల్లో నిర్వహించే భద్రతా కసరత్తులు.. విపత్తు సంభవించినప్పుడు స్పందించే తీరును స్పష్టం చేస్తుంది. ఒకవేళ అనుకోకుండా ప్రమాదం సంభవిస్తే.. అందుకు ముందస్తుగా వనరులు, విపత్తు నివారణ చర్యలు తీసుకోవడానికి సహకరిస్తుంది. అదే రీతిలో సంస్థ చుట్టు పక్కల ఉన్న వారిని ఆదుకోవడానికి, వారికి ఎలా రక్షణ కల్పించాలో తెలిసివస్తుంది. స్థానికంగా చేపట్టాల్సిన చర్యలపైనా కంపెనీలు అవగాహన కలిగి ఉండాలి.
ఎల్జీ నియమాలు పాటించిందా..
విశాఖ విపత్తుకు కారణమైన ఎల్జీ సంస్థ రసాయన కర్మాగారాల విషయంలో రూపొందించిన ప్రామాణిక నియమాలు పాటించిందా..! అంటే.. ప్రాథమిక ఆధారాల ప్రకారం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఘటనను ఆ యూనిట్ వరకూ పరిశీలిస్తే..
- సాధారణంగా రసాయన కర్మాగారాలు కొన్ని రోజులు ఉత్పత్తి మొత్తాన్ని నిలిపేసి.. తిరిగి ప్రారంభించే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అత్యంత విపత్తు సంభవించే కర్మాగారాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. కేంద్ర పర్యావరణ శాఖ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ప్రాథమిక నివేదిక ప్రకారం ఎల్జీ పాలిమర్స్‌లో అవేవీ ఎక్కడా కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు.
- తెల్లవారుజామున 2.30 గంటలకు కొద్దిమంది సిబ్బంది ప్లాంటును తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.
- గ్యాస్ లీకైతే వెంటనే పసిగట్టడానికి అనువుగా హెచ్చరిక పరికరాలు గానీ, లీక్ డిటెక్షన్ రాడార్ వ్యవస్థ(ఎల్డీఏఆర్)లేదని తెలుస్తోంది. కంపెనీలో ఈ వ్యవస్థలు ఉండి ఉంటే.. ఇంత స్థాయిలో ప్రమాదం జరగడానికి ఆస్కారం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
- ప్రతి రసాయన పరిశ్రమకు ఆకస్మిక పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రత్యేకమైన ఆన్‌సైట్, ఆఫ్‌సైట్ ప్రణాళికలు ఉండాలని... అవి ఈ పరిశ్రమలో ఎంత వరకు ఉన్నాయో తెలియడం లేదని.. డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఆఫ్ నాలెడ్జ్ లింక్స్ సంస్థ అధిపతి అమిత్ తుతేజా అభిప్రాయపడ్డారు.
నిబంధనలు అమలు చేయడంలో ఓ వైపు కంపెనీ నిర్లక్ష్యం ఉంటే.. ప్రభుత్వ యంత్రాంగ పర్యవేక్షణ లోపం సైతం ఉందని నిపుణులు అంటున్నారు. ప్రతి జిల్లాలో రసాయన కర్మాగారాల పర్యవేక్షణ బాధ్యత అంతా స్థానిక యంత్రాంగానికే ఉంటుంది. అధికారులు కర్మాగారం పునఃప్రారంభ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించి.. సంస్థపై నిఘా పెట్టి ఉంటే ఇంతటి విపత్తుకు జరిగేది కాదన్నది నిపుణుల అభిప్రాయం.