విజయవాడ విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్న ఏపీఎస్పీ 16వ బెటాలియన్ పోలీసుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. బెటాలియన్ వంట మనిషికి కరోనా సోకగా... అనంతరం ప్రైమరీ కాంటాక్ట్ లకు పరీక్షలు చేస్తే 24 మందికి పాజిటివ్ వచ్చింది. వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా వైద్యులు 11 మందికి మాత్రమే కరోనా సోకిందని చెప్తున్నారు. వైరస్ కలకలంతో బెటాలియన్ కు రిలీవ్ ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి మూడో రోజు నుంచి విధులకు రమ్మని ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడంతో సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైరస్ సోకినట్లు వ్యక్తిగతంగా ఫోన్లు వచ్చినా వైద్యుల జాబితాలో పేర్లు లేకపోవడంతో అధికారులు విధులకు రమ్మంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 105 మంది ఉన్న బెటాలియన్ బృందానికి చిన్నపాటి ఇరుకు గదులు కేటాయించడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. బెటాలియన్ లో కరోనా కేసుల అలజడితో ఏపీఎస్పీ 16వ బెటాలియన్ పోలీసులు ఈనాడు, ఈటీవీ భారత్ ను ఆశ్రయించారు. తోటి సిబ్బందిలో పది మందికి వైరస్ నిర్ధరణ అయినట్లు ఫోన్లు వచ్చినా ఉన్నతాధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా పాజిటివ్ వచ్చిన పోలీసుల్లో ఐదుగురిని పిన్నమనేని వైద్య కళాశాల ఐసోలేషన్ వార్డుకి తరలించారు. మరో ఐదుగురిని తరలించాల్సి ఉంది.
ఇదీ చదవండి : ఆస్పత్రిలో సిబ్బంది లేమి.. బల్లపైనే ప్రసవం