రాజ్యసభలో ఛైర్మన్ వెంకయ్యనాయుడుపై వైకాపా ఎంపీ విజయసాయి చేసిన వ్యాఖ్యల పట్ల ఎంపీ రఘురామకృష్ణరాజు ఘాటుగా స్పందించారు. మనిషికి ఉండే కనీస జ్ఞానం కొంత మందికి లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో తక్కువ, విశాఖలో ఎక్కువగా ఉండే విజయసాయిరెడ్డికి విశాఖలోనే మానసిక వైద్యం అందించాలని ఎద్దేవా చేశారు.
పరువు పోయింది...
విజయసాయిరెడ్డి వల్ల వైకాపా పరువు, సీఎం జగన్ పరువు దిల్లీలో పోయిందని రఘురామ వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డిని రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛ హరిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి కోర్టుకు వెళ్లడం హాస్యాస్పదమన్న రఘురామ... రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండే వారిపై వ్యాఖ్యలు చేసే మంత్రులకు, ఎంపీలకు రాజ్యాంగం గురించి అవగాహన తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు.
సీరియస్‌గా పోరాడమని చెప్పండి...
విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై పార్టీ ఎంపీలను సీరియస్‌గా పోరాడాలని చెప్పండంటూ... ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. సీఎం అనుమతి లేకుండా విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాదని పేర్కొన్నారు.
తెలంగాణలో ఓట్లు రావడం కష్టం..
జగన్, షర్మిల మధ్య.. అన్నాచెల్లెళ్లుగా మంచి అన్యోన్యత ఉందని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. షర్మిల పార్టీ పెట్టడం జగన్ డైరెక్షన్లో జరిగిందా లేదా అనేది త్వరలో తేలుతుందని వ్యాఖ్యానించారు. దివంగత వైఎస్సార్ తెలంగాణకు వ్యతిరేకం, సమైఖ్య ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలమని గుర్తు చేశారు. వైఎస్ పేరు లేకుండా షర్మిల లేదని... ఇలాంటి పార్టీకి తెలంగాణలో ఓట్లు రావడం కష్టమని జోస్యం చెప్పారు. తమిళనాడులోనో, కర్నాటకలోనో పార్టీ పెట్టి ఉంటే.. ఎక్కువ ఓట్లు వచ్చేవని సూచించారు.
ఇదీ చదవండి: