కుల, మతాలతో సమాజాన్ని విడగొట్టే శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Vice president Venkaiah naidu) పిలుపునిచ్చారు. అరబిందో ఘోష్ గొప్ప తత్వవేత్త అని ఆయన చెప్పిన ఆచరణ మార్గాలు నేటి సమాజానికి కూడా చాలా ముఖ్యమని అన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ భాగస్వామ్యంతో తెలంగాణలోని హైదరాబాద్లో శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహించిన తత్వవేత్త అరబిందో ఘోష్ 150వ జయంతి వేడుకల్లో వెంకయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అరబిందో చరిత్రను తెలియచేసే ప్రదర్శనను ప్రారంభించారు. భారత సంస్కృతి సంప్రదాయాలను ప్రాచూర్యంలోకి తీసుకురావాలని అరబిందో ఆశించారని... మతం ప్రాంతం, భాష, జాతి ఆధారంగా వేర్పాటు చేసే శక్తులపై పోరాడాలని పిలుపునిచ్చారని... ఇవి ప్రస్తుత సమాజంలో చాలా ముఖ్యమని వెంకయ్య అన్నారు.
మానవ నాగరికతలో ఆసియా పాత్రను మళ్లీ పోషించేలా చేయాలని అరబిందో ఆశించారని... ఇది ప్రపంచ మానవ మనగడకు చాలా అవసరమన్నారు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి రాజకీయ సాధానం మాత్రమేనని... ఇది నిజమైన దేశాల సమాఖ్య కాదన్నారు. భారతదేశం విశ్వగురువుగా మారాలని ఆశించారని పేర్కొన్నారు. భారతీయులకు నైపుణ్యం ఉంది కాబట్టే గ్లోబల్ కంపెనీలకు సారథ్యం వహిస్తున్నారని అన్నారు. ఘనమైన భారత చరిత్రను అందరికి తెలియజేయాలని వెంకయ్య పిలుపునిచ్చారు.
'అరబిందోఘోష్ గొప్ప పరిశోధకుడు, యోగి, తత్వవేత్త, కవి, స్వాతంత్య్ర సమరయోధుడు. సమాజంలోని అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావాలని అరబిందో ఘోష్ కలగన్నారు. భారతదేశం నేడు స్వేచ్ఛను పొందింది కానీ ఐక్యతను సాధించలేదు. కుల, మత, భాష, వర్ణ బేధాలతో దేశాన్ని విడగొట్టే శక్తులకు వ్యతిరేకంగా పోరాడుదాం. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే ఆలోచనతో ముందుకుసాగుదాం.
-- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి