దేవాదాయ శాఖ నిర్వహణలో భాగస్వామ్యమయ్యేలా ఆగమ సలహా మండలిని వెంటనే ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర స్వామి సూచించారు. సలహామండలి సూచనలతో ఆలయాల నిర్వహణలో మార్పులు చేపట్టాలని తెలిపారు. చాతుర్మాస్య దీక్ష చేపట్టిన పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వాములను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రిషికేష్ వెళ్లి కలిశారు. పీఠాధిపతుల ఆశీస్సులు అందుకున్నారు. రిషికేష్ వద్ద గంగాతీరంలో పవిత్ర స్నానమాచరించి పూజలు నిర్వహించారు.
విశాఖ శ్రీ శారదాపీఠం రిషికేష్ ఆశ్రమంలో శ్రీ శారదా స్వరూప రాజశ్యామల, చంద్రమౌళీశ్వరుల పీఠార్చనకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖకు సంబంధించిన అనేక అంశాలను, సమస్యలను స్వామి స్వరూపానందేంద్ర.. దేవాదాయశాఖ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దేవాదాయ శాఖలో విస్తృతంగా మార్పులు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఆలయాల్లో సిబ్బంది కొరత ఎక్కువగా ఉన్నందున నిర్వహణలో లోపాలు తలెత్తే అవకాశాలున్నాయని మంత్రి వెల్లంపల్లికి తెలిపారు. అధికారులతో సరైన రీతిలో పనిచేయించాలని, ఆధ్యాత్మిక మార్గానికి బాటలు వేసేలా ఆలయాలను తీర్చిదిద్దాలని స్వామీజి సూచించారు.
మారుమూల ప్రాంతాల్లోని ఆలయాలను కేంద్రంగా చేసుకుని హిందూ ధర్మ ప్రచారం చేపట్టాలని శ్రీ స్వరూపానందేంద్ర స్వామి సూచించారు. అన్యాక్రాంతం అవుతున్న ఆలయ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఆర్కియాలజీ శాఖ పరిధిలో ఉన్న ఆలయాల అభివృద్ధికి కేంద్రంతో చర్చించాలని సూచించారు. పంచారామ క్షేత్రాల్లో సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలన్నారు. చాతుర్మాస్య దీక్ష అనంతరం పంచారామ క్షేత్రాలపై విశాఖ శ్రీ శారదాపీఠం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని స్పష్టం చేశారు. అర్చకులు, పాలక మండళ్ల మధ్య సమన్వయం ఏర్పడేలా ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వాలని స్వరూపానందేంద్ర స్వామి సూచించారు. శ్రీకాకుళం జిల్లా గుళ్ల సీతారామపురం ఆలయ ఆస్తుల పరిరక్షణకు చర్యలు వేగవంతం చేయాలన్నారు.
ఇదీ చూడండి: Khairatabad Ganesh: ఖైరతాబాద్ బడా గణేశ్‌కు తుది రూపం.. ఈసారి భక్తులందరికీ నేత్రోత్సవం