ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పరిషత్ ఎన్నికల్లో.. అక్కడక్కడా గొడవలు, ఘర్షణలు చెలరేగాయి. పలువురికి స్వల్వ గాయాలు కాగా.. కొన్నిచోట్ల వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు తక్షణమే స్పందించిన కారణంగా.. ఆయా వివాదాలు సద్దుమణిగాయి.
కృష్ణా జిల్లాలో...
కంచికచర్ల మండలం పేరకలపాడులో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. అధికార వైకాపా, ప్రతిపక్ష తెదేపా నాయకులు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఓ వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో.. రెండు పార్టీల మధ్య వివాదం చెలరేగింది. వివాదానికి కారణమైన ఇరువర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లో కేసు నమోదు చేశారు.
గుంటూరు జిల్లాలో...
పెదనందిపాడు మండలం రాజుపాలెంలో కమ్మ మల్లిఖార్జునరావు, నెప్పలి సాంబయ్య వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓటు వేసేందుకు వెళ్లిన సమయంలో వివాదం చెలరేగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. సాంబయ్య, ప్రకాష్ తలలకు గాయాలై తీవ్ర రక్తస్రావమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గొడవను సర్దుమణిగేలా చేశారు. క్షతగాత్రులను బాపట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పెదకూరపాడు మండలం గారపాడులో.. ఓ మహిళ లైనులో నుంచుని ఓటు వేసే విషయంలో వివాదం తలెత్తింది. వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరకు పోలీసులు వచ్చి ఇరువర్గాలకు సర్దిచెప్పారు.
తెనాలి మండలం కొలకలూరులో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారులు ఓట్లు వేసేందుకు రాగా... వారికి గుర్తు గురించి చెబుతున్నారు. దీనిపై వైకాపా నేతలు గొడవకు దిగారు. పోలింగ్ కేంద్రం వద్దే స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారులపై దాడి చేశారు. వెంటనే జోక్యం చేసుకున్న పోలీసులు రెండు వర్గాల వారిని చెదరగొట్టారు. పలువురికి స్వల్పగాయాలయ్యాయి.
చిత్తూరు జిల్లాలో...
యాదమరి మండలం కోణాపల్లెలో వైకాపా కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు కారులో బయలు దేరిన తెదేపా కార్యకర్తలను అధికార పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కారు అద్దాలను పగులగొట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో...
తాళ్లూరు మండలం శివరాంపురంలో వైకాపాకు చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో.. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ రావు సోదరుడు రవీంద్ర కారుపై.. వైకాపా రెబల్ అభ్యర్థి వర్గం కార్యకర్తలు రాళ్లు విసిరారు. ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొనగా.. పోలీసులు రంగప్రవేశం చేసి గుంపులుగా ఉన్న ప్రజలను చెదరగొట్టారు. ఈ క్రమంలో స్వల్ప లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.
దొనకొండ మండలం ఇండ్లచెరువు పోలింగ్ కేంద్రం వద్ద.. వైకాపాలోని ఇరువర్గాలు నువ్వా-నేనా అన్నట్లుగా గొడవకు దిగాయి. పలువురికి గాయాలు కాగా.. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎన్నికలను సజావుగా నిర్వహించారు.
అద్దంకి మండలం ధర్మవరంలో వైకాపా, తెదేపా నాయకుల మధ్య తోపులాట జరిగింది. తెదేపా వర్గానికి చెందిన ఓ యువతి ఓటు వేసి వస్తున్న సమయంలో.. అధికార పార్టీ కార్యకర్తలు అసభ్యకరంగా మాట్లాడారంటూ ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
కర్నూలు జిల్లాలో...
దేవనకొండ మండలం బేతపల్లిలో వైకాపా నాయకులు దౌర్జన్యానికి దిగారు. పరిషత్ ఎన్నికల్లో ప్రజలను ఓటు వేయనీయకుండా అడ్డుకున్నారు. కర్రలు చేతపట్టుకుని భయానక వాతావరణం సృష్టించారు. ఇంత జరుగుతున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడంతో.. ప్రజలు నిరాశగా వెనుదిరిగారు.
కడప జిల్లాలో...
చాపాడు మండలం అయ్యవారిపల్లె పోలింగ్ కేంద్రం నుంచి బ్యాలెట్ పేపరును బయటకు తీసుకురావడంతో.. తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి రాజేశ్వరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓటు వేసేందుకు ఓ వృద్ధురాలు రాగా.. అధికారులు బ్యాలెట్ పేపరు జారీ చేశారు. ఆమె ఓటు వేసి.. పత్రాన్ని పెట్టెలో వేయాలంటూ ఎన్నికల సిబ్బందిని కోరింది. ఆ సమయంలో అక్కడే ఉన్న తెదేపా అభ్యర్థి.. మీరెలా ఓటు వేస్తారంటూ బ్యాలెట్ పేపరును లాక్కున్నారు. ఈ ఘటనతో అక్కడ వివాదం చెలరేగగా.. రాజేశ్వరిని పోలీసులు బయటకు తీసుకొచ్చారు.
నెల్లూరు జిల్లాలో...
చేజర్ల మండలం మాముడూరు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైకాపా ఏజెంట్లపై స్వతంత్ర అభ్యర్థి అభ్యంతరం తెలపడంతో.. కొద్దిసేపు అధికారులు పోలింగ్‌ను నిలిపివేశారు. గతంలో నేర చరిత్ర ఉన్న రౌడీషీటర్లను ఏజెంట్లుగా పెట్టారంటూ స్వతంత్ర అభ్యర్థి ఫిర్యాదు చేశారు. మా మీదే ఫిర్యాదు చేస్తారా అంటూ.. అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో మహిళా స్వతంత్ర అభ్యర్థితో సహ మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని బాధిత వర్గం ఆరోపించింది. గొడవ జరిగుతున్న సమయంలో కొందరు ఫోన్లో చిత్రీకరిస్తుండగా.. వారి చరవాణులను పోలీసులు లాక్కున్నారని చెబుతున్నారు.
ఏఎస్ పేట మండలం పోనుగోడులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ వృద్ధురాలు ఓటు వేసే విషయంలో.. భాజపా, వైకాపా ఏజెంట్ల మద్య వివాదం చెలరేగగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో భాజపా ఏజెంట్ ప్రసాద్.. పోలింగ్ కేంద్రంలోని బ్యాలెట్ బాక్స్‌ను ఎత్తుకెళ్లి పక్కనే ఉన్న నీళ్ల తొట్టెలో వేశాడు. అడ్డువచ్చిన పోలింగ్ సిబ్బందిని నెట్టివేశాడని అధికారులు అంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రేపు రీ-పోలీంగ్ నిర్వహించనున్నారు.
అనంతపురం జిల్లాలో...
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా.. ధర్మవరం మండలం రేగాటి పల్లెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు మధుసూదన్ రెడ్డి ఇంటిపై.. స్థానిక వైకాపా శ్రేణులు రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో మధుసూదన్ రెడ్డికి చెందిన వాహనం దెబ్బతింది. గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడటంతో.. పోలీసులు చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. దాడులు, దౌర్జన్యాలతో గెలుపొందేందుకు వైకాపా యత్నిస్తోందని మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు.
ధర్మవరం మండలం వెంకట తిమ్మాపురంలో భాజపా ఏజెంట్ నారాయణ స్వామిని వైకాపా శ్రేణులు అపహరించి చితకబాదారు. భాజపా ఎంపీటీసీ అభ్యర్థి కల్పన తరఫున నారాయణస్వామి ఏజెంట్‌గా పోలింగ్ కేంద్రంలో కూర్చున్నాడు. బయటకు రావాలని పోలీసులు పిలుస్తున్నారు అనిచెప్పి.. తనను బలవంతంగా కారులో ఎత్తుకెళ్లి వైకాపా శ్రేణులు దాడిచేశారని నారాయణస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విజయనగరం జిల్లాలో...
ఏపీ, ఒడిశా సరిహద్దుల్లోని వివాదాస్పద కొఠియా గ్రామాల్లో.. ఓటర్లను బయటకు రాకుండా పొరుగు రాష్ట్ర భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. కొవిడ్ సాకుతో పరిషత్ ఎన్నికల్లో పాల్గొనకుండా ఒడిశా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నేరేళవలస, పట్టుచెన్నేరులో 6 పాజిటివ్ కేసులు ఉన్నందున.. కరోనా విస్తరించకుండా చర్యలు చేపడుతున్నట్లు లేఖ విడుదల చేసింది. గంజాయిభద్ర నుంచి వచ్చే దారులను మూసేవేసి పోలీసులతో పహారా ఏర్పాటు చేసింది. యథాతథస్థితిని ఉల్లంగిస్తున్నారని.. ఇది సరైన విధానం కాదని ఏపీ అధికారులు, ప్రజా ప్రతినిధులు నచ్చజెప్పారు.
ఒడిశా యంత్రాంగం ఆంక్షలు విధించినా దాటుకుని వచ్చిన తమను.. ఓటు వేయకుండా అధికారులు తిరస్కరించారని గిరిశిఖర ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సహకరించాలి అని డిమాండ్ చేశారు. పట్టు చెన్నారు, పగలు చెన్నారులో గిరిజనులు తొణం పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించారు. సరైన గుర్తింపు కార్డు లేకపోవడంతోనే తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో...
బూర్జ మండలం చిన్న లాంకం పోలింగ్ కేంద్రం వద్ద.. రెండు వర్గాలు గొడవకు దిగాయి. ఓ వృద్ధుడు ఓటు వేసేందుకు వెళ్తుండగా.. ఆయనకు సహాయకుడిగా మరొకరు పోలింగ్ కేంద్రంలోకి రావడాన్ని వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య చెలరేగిన ఈ ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సీఐ ప్రసాద్‌రావు ఘటనా స్థలానికి చేరుకుని.. ఇరువర్గాలను హెచ్చరించడంతో గొడవ సద్దుమణిగింది.
ఇదీ చదవండి:
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.. ఫలితం మిగిలింది