ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో 11 జాతీయ సంస్థల ప్రతినిధులు, రాష్ట్ర శాఖల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా 11 వేల 158 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని.. జూన్ నాటికి అవి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కేంద్రాల్లో వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య, ఆక్వా సహాయకులు ఉంటారన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా దెబ్బతింటున్నారని.. రైతు భరోసా కేంద్రాల్లో లభించే సరకుకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. సేంద్రీయ సాగు, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ ఇస్తామని.. ఉత్తమ సాగు యాజమాన్య విధానాలను అందుబాటులోకి తెస్తామన్నారు.
పంట వేసే ముందే మద్దతు ధర
పంట వేసే ముందే ఆయా పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. రైతుకు నష్టం వచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వమే పంటను కొనుగోలు చేస్తుందని తెలిపారు. దీని వల్ల మార్కెట్లో పోటీ పెరుగుతుందని, రైతుకు మంచి ధర లభించే అవకాశం ఉంటుందన్నారు. అప్పటికీ సరైన ధర రాకుంటే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆదుకుంటామన్నారు. అగ్రి మార్కెటింగ్ అంశాలపైనా ప్రఖ్యాత సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలని సీఎం అన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ సమూల మార్పులకు నాంది పలుకుతుందని జగన్ ఉద్ఘాటించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో విప్లవానికి ఇవన్నీ దోహదం చేస్తాయన్నారు.
ఇవీ చదవండి: