ముంబయిలోని జేజే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వరవరరావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ‘న్యూరాలజీ విభాగంలో చికిత్స అందిస్తున్నామని... ఆయన ఆరోగ్యాన్ని విశ్లేషించేందుకు కొంత సమయం పడుతుందని ఆస్పత్రి డీన్ డా.రంజిత్ మంగళవారం వెల్లడించారు.
81 ఏళ్ల వ్యక్తి దేశ భద్రతకు ముప్పు కలిగిస్తాడా? : లోక్‌సభ ప్రతిపక్ష నేత
వరవరరావు విడుదల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ లోక్‌సభ ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌధరి మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 81 సంవత్సరాల వయసున్న ప్రముఖ తెలుగు రచయిత ప్రస్తుతం అత్యంత శక్తిమంతమైన దేశాల్లో ఒకటైన భారత్ భద్రతకు ఏవిధంగా ముప్పు కలిగిస్తాడని ఆ లేఖలో పేర్కొన్నారు. 'తను చేసిన నేరం ఏంటో కూడా తెలియకుండానే ఆయన దీర్ఘకాలంగా జైలు జీవితం అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. సరైన వైద్య సదుపాయం కూడా అందడం లేదు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవాలి. లేదంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు' అని అధిర్ తన లేఖలో పేర్కొన్నారు.
వరవరరావును విడుదల చేయండి: సీపీఐ ఎంపీ
ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వరవరరావును వెంటనే విడుదల చేయాలని కోరుతూ సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వం మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌థాక్రేకు లేఖ రాశారు. వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఆయన ఉన్నారని గుర్తు చేశారు. వరవరరావును జైలులో కొనసాగించడమంటే.. న్యాయాన్ని అవహేళన చేయడం, కస్టోడియల్ హింసకు నిదర్శనం వంటివేనని విశ్వం పేర్కొన్నారు. పుణేలో డిసెంబర్ 31, 2017లో జరిగిన ఎల్గార్ పరిషద్ సమావేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, ఫలితంగా ఆ మరుసటి రోజు కోరేగాం-భీమా ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయని ఆరోపిస్తూ పోలీసులు వరవరరావుపై కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో తొమ్మిది మందిని కూడా అరెస్టు చేశారు. ఈ కేసు ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆధీనంలో ఉంది.
ఇదీ చూడండి
క్లినికల్ ట్రయల్స్‌కు తొలి అడుగు.. నిమ్స్‌లో రక్త నమూనాల సేకరణ