కరోనా సమయంలో ఆమె ఎందరికో ప్రాణాలు నిలిపింది. నిండు గర్భిణి అయినా... తన వల్ల కొందరి ప్రాణాలు నిలుస్తాయని విధులకు హాజరైంది. చివరికి అదే వైరస్ భారిన పడి... ప్రాణాలతో కొట్టిమిట్టాడుతోంది. వైరస్‌తో పోరాడుతున్నప్పుడే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆమె... ఆందోళనకరమైన పరిస్థితుల్లో బతికేందుకు పోరాడుతోంది.
డాక్టర్ శారదా సుమన్(32) అందరిలానే జీవితం గురించి ఎన్నో కలలు కన్నారు. గౌరవనీయమైన వైద్యవృత్తి.. మంచి భర్త.. జీవితం సాఫీగా సాగుతున్న తరుణంలో కరోనా ఆమెపై పగపట్టింది. యూపీ రాజధాని లఖ్‌నవూలోని రామ్‌మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైస్సెస్‌లో పీజీ రెసిడెంట్ వైద్యురాలిగా ఎంతోమంది కరోనా రోగులకు చికిత్స చేసి ఇళ్లకు పంపారామె. నిండు గర్భిణి అయినా.. ఒక్క రోజూ విధులకు గైర్హాజరయింది లేదు. జాగ్రత్తలు తీసుకుంటూనే రోగులకు సేవలందించి ప్రశంసలు పొందారు.
కానీ.. విధి ఆమెతో ఆడుకుంది. ఏప్రిల్ 14న కొవిడ్ బారిన పడ్డారు. అప్పటికి ఆమె 8 నెలల గర్భవతి. వారం పాటు ఆరోగ్యం సవ్యంగానే ఉన్నా.. తర్వాత విషమించింది. వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించారు. తరవాత ఊపిరితిత్తుల్లో గడ్డలు(ఫైబ్రోసిస్) వచ్చినట్లు గుర్తించారు. మే 1న అత్యవసర శస్త్రచికిత్స చేసి పురుడుపోశారు. పండంటి ఆడబిడ్డ పుట్టింది. అప్పటికే శారద ఆరోగ్యం విషమించడంతో ఎక్మో సాయంతో ఊపిరి అందించారు. నెల పాటు ఎదురుచూసినా.. ఆరోగ్యం కుదుటపడలేదు. మరోసారి సమీక్షించిన వైద్యులు ఆమె ఊపిరితిత్తులు మార్చాలని నిర్ణయించారు.
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చికిత్స కోసం రూ.1.50 కోట్లు మంజూరు చేశారు. ఊపిరితిత్తుల మార్పిడికి ఎయిర్ అంబులెన్సులో గత నెల 11న సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఎక్మోపై చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల దాత కోసం జీవనదాన్‌లో కుటుంబ సభ్యులు పేరు నమోదు చేశారు. ఎంతోమందికి ఊపిరిపోసిన వైద్యురాలికి అవసరమైన ఆ అవయవం ఎప్పుడు లభిస్తుందో కూడా చెప్పలేని ఆందోళనకర పరిస్థితి నెలకొంది.