డీఎస్సీ-2018 సెకండరీ గ్రేడ్ టీచర్స్ (తెలుగు) పోస్టుల భర్తీ ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ చేపట్టింది. కోర్టు కేసుల కారణంగా కొంత కాలంగా నిలిచిపోయిన ప్రక్రియను ఇప్పుడు వేగవంతం చేసింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు గడువు ముగియడంతో భర్తీని చేపట్టారు. అర్హత ధ్రువపత్రాల పరిశీలనకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3,398 పోస్టులను భర్తీ చేయనున్నారు. విద్య అర్హత ధ్రువపత్రాలను గురు, శుక్రవారాల్లో అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేందుకు అవకాశం కల్పించింది. వీటిని ఎంపిక కమిటీ ఈ నెల 7 నుంచి 10 వరకు పరిశీలిస్తుంది. నెల్లూరు, చిత్తూరు, కడప, కృష్ణా జిల్లాల్లో 7న, విజయనగరం, ప్రకాశం, పశ్చిమగోదావరి, గుంటూరులో 7, 8న, అనంతపురం, శ్రీకాకుళం, కర్నూలు, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో 7 నుంచి 10వరకు అభ్యర్థులు అప్‌లోడ్ చేసిన ధ్రువపత్రాలను ఎంపిక కమిటీ పరిశీలిస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలను అభ్యర్థుల సెల్‌ఫోన్లకు గురువారం సంక్షిప్త సందేశాలు పంపుతారు.
ఇదీ చదవండి
శ్రీచైతన్య విద్యాసంస్థల...ఫిట్ ఇండియా ప్రపంచ రికార్డులు కైవసం