రుణ యాప్‌ల కేసులో ప్రధాన సూత్రధారి సహా ఇద్దరిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ముంబయి కేంద్రంగా రుణ యాప్‌లు నిర్వహిస్తున్నట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. నిందితులు హి జియాన్ (చైనా), వివేక్‌కుమార్ (యూపీ)గా గుర్తించారు. వారి నుంచి 4 ల్యాప్‌టాప్‌లు, 2 చరవాణులను రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కేసు దర్యాప్తులో హి జియాన్ ప్రధాన సూత్రధారిగా తేలిందని సీపీ తెలిపారు. వ్యాపార వీసాపై 2019లో హి జియాన్ భారత్ వచ్చినట్లు చెప్పారు. పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రుణ యాప్‌లు రూపొందించి సూక్ష్మ రుణాలు ఇస్తున్నట్లు వివరించారు.
'24 యాప్‌లు రూపొందించి భారీగా రుణాలు ఇచ్చారు. 50 శాతం వడ్డీతో వసూలు చేస్తున్నారు. రుణాల వసూలు బాధ్యత కాల్ సెంటర్లకు అప్పగించారు. కాల్ సెంటర్ల వేధింపులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో రుణ వేధింపులకు ఆరుగురు చనిపోయారు.'
- మహేశ్ భగవత్, రాచకొండ సీపీ
రుణయాప్ కేసులో తాత్కాలికంగా రూ.28 కోట్లు జప్తు చేసినట్లు మహేశ్ భగవత్ తెలిపారు. సులభ రుణ యాప్‌ల ద్వారా వ్యాపారం విస్తరించారన్నారు. రుణ యాప్‌లను 90 శాతం చైనా వాళ్లే నడిపిస్తున్నారని సీపీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి : "వేధింపులే లక్ష్యం... లోన్ వసూలుకు మార్గం"