విశాఖ జిల్లా అనకాపల్లి జాతీయ రహదారి వద్ద.. నిర్మాణ దశలో ఉన్న వంతెన కూలిన ఘటన.. రాష్ట్ర ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మృతదేహాలను గడ్డర్ల కింద నుంచి మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో పైకి తీశారు. అయితే మృతదేహాలను పోస్టుమార్టానికి తీసుకెళ్లకుండా బంధువులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని ఆర్తనాదాలతో డిమాండ్ చేశారు.
ఏ క్షణములో ఎటునుంచి ప్రమాదం పొంచి ఉంటుందో ఎవరికి తెలియదు. ఏ ప్రమాదం ఎవరిని బలితీసుకుంటుందో చెప్పలేము. అలాగే జార్ఖండ్‌కు చెందిన ఆ కుటుంబానికి నిర్మాణంలో ఉన్న వంతెన రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. సాఫీగా రోడ్డుపై కారులో ప్రయాణిస్తుండగా... ఒక్కసారిగా కూలి ఇద్దరిని పొట్టనపెట్టుకుంది.
సురక్షితంగా బయటపడ్డ లారీ డ్రైవర్, క్లీనర్..
విశాఖ జిల్లా అనకాపల్లి జాతీయరహదారిపై ఇంటర్‌ఛేంజ్ వంతెన నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆనందపురం-అనకాపల్లి జాతీయరహదారి విస్తరణలో భాగంగా అనకాపల్లి సమీపాన పొడవైన వంతెన నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే వంతెన కోసం నిర్మించిన పిల్లర్లపై గడ్డర్‌లు అమర్చారు. కానీ వాటిలో రెండు గడ్డర్లు మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా కూలిపోయాయి. అదే సమయంలో వంతెన కిందికి వచ్చిన ఓ లారీ వెనక భాగంలో గడ్డర్లు పడటంతో... లారీ క్యాబిన్‌లో ఉన్న డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డారు. కానీ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.
కొత్త కారులో నూకాలమ్మను దర్శించుకుని వస్తుండగా..
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సతీష్‌కుమార్ కుటుంబం.. గాజువాకలోని శ్రీహరిపురం వద్ద నివసిస్తున్నారు. వారు నూతనంగా కొనుగోలు చేసిన కారులో.. అనకాపల్లి నూకాలమ్మను దర్శించుకుని తిరిగి వెళ్తుండగా... ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా.. ఈ గడ్డర్లు సరిగ్గా కారు ముందుభాగంలో పడటంతో... ముందు కూర్చున్న సతీష్‌కుమార్, సుశాంత్ మహంతి ప్రాణాలు వదిలారు. సతీష్‌కుమార్ టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా... సుశాంత్ మహంతి హెచ్పీసీఎల్లో కాంట్రాక్టర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వెనకాల కూర్చున్న ముగ్గురు మహిళలు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే.. పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్రేన్ సాయంతో గడ్డర్లను తొలగించి.. మృతదేహాలను వెలికితీశారు. గడ్డర్లు భారీగా బరువు ఉండటంతో.. వాటిని తొలగించడం కష్టంగా మారింది. అయితే ప్రమాదానికి కారణమైన గుత్తేదారులు సంఘటన స్థలానికి రావాలని మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. చివరికి పోలీసులు సర్దిచెప్పి.. మంగళవారం అర్థరాత్రి దాటాక.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
కాంట్రాక్టర్‌ను అరెస్ట్ చేయాలి: తెదేపా
నిర్మాణంలో ఉన్న వంతెన కూలిన ఘటనలో కాంట్రాక్టర్‌ని వెంటనే అరెస్ట్ చేయాలని తెదేపా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ధ నాగజగదీశ్వరరావు డిమాండ్ చేశారు. మృతులకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు.
ఇదీ చదవండి