ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.. అందుబాటులో వైద్యులున్నారు. అయినా ఓ గర్భిణికి పురుడు పోయలేకపోయారు. పురిటి నొప్పులతో సిద్దిపేట, గజ్వేల్, కరీంనగర్ ఆసుపత్రులకు తిరిగినా కవలలను బతికించలేకపోయారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన కమల(33)కు ప్రసవ సమయం దగ్గరికి రావడంతో భర్త రామస్వామి ఈ నెల 17న(సోమవారం) కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు.
పరీక్షించిన వైద్యులు ప్రసవానికి మరో అయిదు రోజుల సమయం ఉందని, సిద్దిపేటలోనే ప్రసవం చేయించుకోవాలని సూచించారు. ఈ నెల 19న రాత్రి కమలకు పురిటి నొప్పులు రావడంతో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఇక్కడ కరోనా రోగులు ఎక్కువమంది ఉన్నారని, గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అదే అంబులెన్స్‌లో సిద్దిపేట నుంచి గజ్వేల్ వెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్ వెళ్లాలని సూచించారు.
అప్పటికే ఆమెకు పురిటినొప్పులు అధికమవడం, రక్తస్రావం అవుతుండడంతో కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు కవల పిల్లల్లో ఒకరు మృతి చెందారని చెప్పి ఈ నెల 20న సాయంత్రం సిజేరియన్ చేశారు. కవలల్లో ఆడ శిశువు మృతిచెందగా.. మగశిశువును ఇంక్యుబేషన్‌లో ఉంచి రెండు రోజులుగా చికిత్స అందించారు. శనివారం ఆ శిశువూ మృతి చెందాడు. ఆసుపత్రిలో సకాలంలో చేర్చుకొని వైద్యం అందించి ఉంటే తమ పిల్లలు బతికేవారని రామస్వామి వాపోయారు.
అందరికీ చికిత్స అందిస్తున్నాం
కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి.. ఏ జిల్లా నుంచి వచ్చినా చేర్చుకొని చికిత్స అందిస్తున్నాం. కమల ఇక్కడికి రావడం ఆలస్యమైంది అప్పటికే ఒక శిశువు చనిపోయింది. పుట్టిన మగ శిశువు తక్కువ బరువు, ఇతర అనారోగ్య సమస్యలతో చనిపోయాడు.
- డాక్టర్ రత్నమాల, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకురాలు
ఇదీ చదవండి: