హైదరాబాద్‌లోని బసవతారం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి 20 వసంతాలను పూర్తి చేసుకుంది. సంస్థ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ... అక్కడ సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. జూన్ 22న దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా ఈ ఆస్పత్రిని ప్రారంభించారు. ఆస్పత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవానికి సంబంధించిన చిత్రాలను బాలకృష్ణ విడుదల చేశారు.
అత్యున్నత ప్రమాణాలతో సేవలు
ఆసుపత్రి 2దశాబ్దాలుగా అత్యున్నత ప్రమాణాలతో సేవలందిస్తోంది. ఇప్పటివరకు దాదాపు రెండున్నర లక్షల మందికి చికిత్స అందించాం. ప్రారంభ రోజుల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. ఎంతోమంది సహకారంతో ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దాం. 100పడకల ఆసుపత్రిగా ప్రారంభమై నేడు 500పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందింది. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వైద్య సేవలందిస్తున్నాం. ఆసుపత్రి అభివృద్ధిలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు- నందమూరి బాలకృష్ణ, ఆస్పత్రి ఛైర్మన్
సేవలు ప్రశంసనీయం: ఉపరాష్ట్రపతి
బసవ తారకం కేన్సర్ ఆస్పత్రి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేళ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఎంతోమంది పేదలకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలందించటాన్ని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి యజమాన్యంతో పాటు వైద్యులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.
ఎన్టీఆర్ ఆశయాలే స్ఫూర్తిగా...
బసవతారకం ఆస్పత్రి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళి సై శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలను నందమూరి బాలకృష్ణ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. కేన్సర్ చికిత్సలో బసవతారకం ఆస్పత్రి మరిన్ని మైలురాళ్లు అందుకోవాలని ఆకాంక్షించారు. కేవలం కేన్సర్ బాధితుల కోసం 110 బెడ్లతో మొదలై ఇవాళ 500కు పైగా చేరుకుందని గుర్తు చేశారు. ఆస్పత్రి ప్రారంభోత్సవానికి మాజీ ప్రధాని దివంగత వాజ్‌పేయి వచ్చారనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ మేరకు రాజ్‌భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
మరిన్ని మైలురాళ్లు చేరుకోవాలి: చంద్రబాబు
బాలకృష్ణ ఆదర్శప్రాయమైన అంకితభావంతో ఎన్టీఆర్ కలను నెరవేరుస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. ఆసుపత్రి భవిష్యత్‌లో మరిన్ని మైలురాళ్లు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
అభినందనలు: నారా లోకేశ్
తాత ఎన్టీఆర్ గారి సేవాస్ఫూర్తికి, అమ్మమ్మ బసవ తారకం స్మృతికి ప్రతిరూపంగా రూపుదిద్దుకున్న 'బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి' ప్రజల సేవలో 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మావయ్య, ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారికి అభినందనలు- నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి
ఇదీ చదవండి: