ఆస్తులను తితిదే దుర్వినియోగం చేస్తుందన్న పిటిషనర్ ఆరోపణ సరికాదని.. ఆ వ్యాజ్యాన్ని కొట్టేయాలని తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ హై కోర్టును కోరారు. తితిదేకు చెందిన తమిళనాడులోని 23 ఆస్తుల వేలాన్ని నిలువరించాలని కోరుతూ భాజపా నేత అమర్నాథ్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఈవో కౌంటర్ వేశారు.
'విరాళాలుగా భక్తులు ఇచ్చిన ఆస్తులను ఎందుకు వినియోగించాలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ తితిదేకి ఉంది. 50 ఆస్తుల విక్రయానికి 2016 జనవరి 30న తితిదే బోర్డు చేసిన తీర్మానాన్ని పక్కన పెట్టాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మే 25న జీవో 888 జారీచేసింది. ప్రపంచవ్యాప్తంగా తితిదేకి స్థిరాస్తులున్నాయని పిటిషనర్ చెబుతున్న దాంట్లో వాస్తవం లేదు. స్వామివారి పేర భక్తులు ఇచ్చిన ప్రతి ఆస్తిలో దేవాలయాలు, ఆశ్రమాలు, పాఠశాలలు, ధ్యానకేంద్రాలు, కల్యాణ మండపాలు నిర్మించడం సాధ్యం కాదు. ఒకవేళ నిర్మించినా.. వాటి నిర్వహణ భవిష్యత్‌లో కష్టమవుతుంది. అంతిమంగా ఆ నిర్మాణాలు తితిదేకు తెల్ల ఏనుగులా తయారవుతాయి. నిర్వహణ సాధ్యంకాని ఆస్తులను విక్రయించడానికి గుర్తించారు తప్ప.. పిటిషనర్ ఆరోపిస్తున్నట్లు సొమ్ము చేసుకోవడానికి కాదు. ఆభరణాల భద్రత విషయంలో జస్టిస్ జగన్నాథరావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇదే వ్యవహారంపై మరో కమిటీ అవసరం లేదు. తితిదేకు చెందిన ధనం, బంగారం, ఫిక్స్ డ్ డిపాజిట్ల విషయంలో ఎలాంటి గోప్యత లేదు' అని కౌంటర్లో ఈవో సింఘాల్ పేర్కొన్నారు.
ఈవో వేసిన కౌంటర్‌పై సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్‌కు సమయం ఇస్తూ.. మూడు వారాలకు విచారణ వాయిదా వేసింది ధర్మాసనం.
ఇదీ చదవండి: ధవళేశ్వరం వద్ద గోదారి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ