తితిదేకు చెందిన భూములు, భవనాలను విక్రయించకూడదని 2020 మే 28న బోర్డు తీర్మానం చేసిందని తితిదే ఈవో కేఎస్ జవహర్ రెడ్డి హైకోర్టులో అఫిడవిట్ వేశారు. తితిదే విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శ్రీవారి ఆస్తుల పరిరక్షణ విషయంతో పాటు ఆచార వ్యవహారాల్లో తగిన సహాయ సహకారాలు తీసుకునేందుకు వీలుగా గౌహతి హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీధర్ రావు, ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి తదితరులతో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. తితిదేకు చెందిన ఆస్తుల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. ఆ వివరాలన్ని తితిదే అధికారిక వెబ్సైట్లో ఉంచామన్నారు. ఆస్తుల పరిరక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
తితిదేకు చెందిన బంగారం, ఆభరణాల విషయంలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఎం.జగన్నాథరావు , జస్టిస్ వాద్వా నేతృత్వంలోని కమిటీలు చేసిన సిఫారసుల మేరకు వ్యవహరిస్తున్నామన్నారు. తితిదేకు చెందిన 23 ఆస్తుల వేలాన్ని నిలువరించాలని కోరుతూ భాజపా నేత అమర్నాథ్ గతేడాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇటీవల జరిగిన విచారణలో శ్రీవారి ఆస్తుల పరిరక్షణ కోసం పలు చర్యలు చేపడుతూ తితిదే తీర్మానం చేసిందని న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఆస్తుల వివరాల్ని వెబ్సైట్లో ఉంచామన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు....తీర్మానం, ఆస్తుల వివరాల్ని కోర్టుకు సమర్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెబ్సైట్లో ఉంచిన ఆస్తుల వివరాల్ని కోర్టు ముందు ఉంచుతూ ఈవో అఫిడవిట్ వేశారు.
పవర్ ప్రాజెక్టు భూములపై యథాతథ స్థితి పాటించండి:హైకోర్టు
నెల్లూరు జిల్లాలో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు భూముల విషయంలో యధాతథ స్థితి పాటించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తి జస్టిస్ ఎన్. జయసూర్య ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ నిర్మించడంలో విఫలమైనందున... నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పరిధిలోని 2635 ఎకరాల్ని వెనక్కి ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ ఫిబ్రవరిలో ఆదేశాలిచ్చారు. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ కోస్టల్ ఆంధ్రా పవర్ లిమిటెడ్, రిలయన్స్ పవర్ లిమిటెడ్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాయి. దీనిపైనే న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.
ఇదీ చదవండి:
వైకాపాలో చేరికపై గంటా గతంలోనే ప్రతిపాదన పంపారు: విజయసాయిరెడ్డి