ప్రపంచవ్యాప్తంగా న్యాయవ్యవస్థలో వస్తున్న మార్పులు, సంస్కరణల ఆధారంగా నేరస్థుడిలో పరివర్తన ద్వారా పూర్వ స్థితిని ఎలా పునరుద్ధరించవచ్చో ‘ట్రాన్స్‌ఫర్మేటివ్ జస్టిస్’ (న్యాయపరివర్తన) పుస్తకంలో చక్కగా ప్రస్తావించారని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి పేర్కొన్నారు. శిక్షాత్మక న్యాయం నుంచి పరివర్తన న్యాయం వైపు మళ్లడం ద్వారా చారిత్రక మైలురాళ్లను ఎలా చేరుకోవాలో రచయిత వివరించారని కితాబిచ్చారు. జ్యుడీషియల్ ప్రివ్యూ కమిటీ న్యాయమూర్తి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బులుసు శివశంకరరావు రచించిన ‘ట్రాన్స్‌ఫర్మేటివ్ జస్టిస్’ పుస్తకాన్ని ఆయన గురువారం మంగళగిరిలోని ఏపీఐఐసీలో ఆవిష్కరించారు.
అనంతరం జస్టిస్ గోస్వామి మాట్లాడుతూ ‘నేర విచారణలో సంస్కరణలు, పునరుద్ధరణ అనే రెండు అంశాలు కీలకం. పుస్తకానికి ‘న్యాయపరివర్తన’ పేరు పెట్టడం రచయిత దృష్టికోణం, మేధోసంపత్తి, క్రిమినల్ జస్టిస్‌పై ఆయనకున్న అవగాహనను వెల్లడిస్తుంది. భావితరాలకు ఉపయుక్తంగా ఉండే ఇలాంటి పుస్తకాలు జస్టిస్ శివశంకరరావు మరిన్ని రాయాలి’ అని ఆకాంక్షించారు. రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణలో న్యాయవ్యవస్థ కీలక స్తంభంగా మారిందని జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ పేర్కొన్నారు. ఈ పుస్తకం పఠనం ద్వారా న్యాయ విజ్ఞానం లభిస్తుందని జస్టిస్ రఘునందనరావు అభిప్రాయపడ్డారు. క్రిమినల్ చట్టానికి ఉన్న సంస్కరణలు, పునరుద్ధరణ అనే రెండు పార్శ్వాలను ఈ పుస్తకం స్పృశించిందని జస్టిస్ దుర్గాప్రసాద్‌రావు పేర్కొన్నారు. మన దేశ సంస్కృతిలో భాగమైన క్షమాగుణాన్ని పుస్తకం చర్చిస్తుందన్నారు. జస్టిస్ ఏవీ శేషసాయి మాట్లాడుతూ పుస్తకానికి పెట్టిన పేరు ద్వారా రచయిత సునిశిత్వం తెలుస్తుందని అన్నారు. చెరకు గడ నమిలేకొద్దీ ఎంత తీపి ఉంటుందో.. పుస్తకాన్ని చదివే కొద్దీ అంత అద్భుతంగా ఉంటుందని రచయిత జస్టిస్ శివశంకరరావు తెలిపారు. కార్యక్రమంలో ఏజీ శ్రీరామ్, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వై.వి.రవిప్రసాద్, రాష్ట్ర బార్ కౌన్సిల్ ఛైర్మన్ అనంతరామారావు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ.. MPP ELECTIONS: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు