ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ప్రధానంగా బీసీ కులాల కార్పొరేషన్ ల ఏర్పాటుపై మంత్రి వర్గంలో చర్చించనున్నారు. కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణకు ప్రకాశం బ్యారేజీ కింద మరో రెండు బ్యారేజీల నిర్మాణాలపై కాబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకంపైనా మంత్రివర్గలో చర్చ జరగనున్నట్టు సమాచారం. రెవెన్యూ వ్యవహారాల పర్యవేక్షణకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో కొత్తగా డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి (డీడీవో)ల నియామకంపై కేబినెట్ లో చర్చ జరగనుంది. ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఒకరు చొప్పున 51 డీడీవో పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలియజేయనుంది.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి కేబినెట్ సంతాపం ప్రకటించనుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతపైనా మంత్రివర్గంలో చర్చ జరగనుంది. రాష్ట్రంలో తీసుకుంటున్న కొవిడ్ నియంత్రణ చర్యలు పైన చర్చించనున్నారు. జీఎస్టీ పరిహారంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మీద కాబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గోదావరి ,కృష్ణ వరద ముంపు ప్రాంతాలలో బాధితులకు అందిన పరిహారంపై చర్చించనున్నారు. వరద నష్టంపై అంచనాలు సిద్ధం చేయడంతో పాటు దానిపై కేంద్రసాయం విషయంలో మంత్రి వర్గంలో చర్చించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: సీఐడీ కేసుపై హైకోర్టును ఆశ్రయించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ