స్థానిక సంస్థల ఎన్నికల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏదైనా కేసులో శిక్ష పడిన వ్యక్తి ఇప్పటికే ఎన్నికైనా అతన్ని పదవి నుంచి తొలగించే విధంగా చట్టం తెచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయకపోయినా, గ్రామసభల నిర్వహణలో విఫలమైనా సర్పంచి, ఉప సర్పంచిలను పదవి నుంచి తొలగించే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం ఇటీవల అత్యవసర ఆదేశం (ఆర్డినెన్స్) తెచ్చింది. ఎన్నికల్లో అవినీతి కార్యకలాపాలకు పాల్పడితే, ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా శిక్ష పడేలా ఇందులో అంశాలను పొందుపరిచారు. ఎన్నికకు సంబంధించి అవినీతికి పాల్పడినట్లు రుజువైతే, అతనికి మూడేళ్ల వరకు జైలు, రూ.10 వేల జరిమానా విధించేలా చట్టంలో పేర్కొన్నారు.
- సర్పంచి, ఉప సర్పంచులను పదవి నుంచి తొలగించే అధికారం కలెక్టర్‌కు అప్పగించారు. తనకు సంక్రమించిన అధికారాలను దుర్వినియోగం చేసినా తన కర్తవ్య పాలనలో దుష్ప్రవర్తనకు పాల్పడినా, గ్రామ పంచాయతీ నిధులను అపహరించినా.. కలెక్టర్, కమిషనర్, ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయడానికి నిరాకరించినా వారిని తొలగించే అధికారం ఉంటుంది. చట్టం ద్వారా సంక్రమించిన అధికారాలు, కర్తవ్యాల నిర్వహణలను అతిక్రమించినా,అసమర్థగా వ్యవహరించినా వారికి వివరణ ఇచ్చే అవకాశం ఇచ్చి సర్పంచి/ ఉప సర్పంచిని తొలగించవచ్చు.
- సర్పంచి గ్రామంలోనే నివాసం ఉండాలి. పంచాయతీ కార్యాలయానికి హాజరుకావాలి.
- గ్రామసభ సమావేశాల నిర్వహణలో విఫలమైనా, నిర్దిష్ట కాలంలో గ్రామ పంచాయతీ ఖాతాలను ఆడిట్ చేయించకపోయినా పదవి నుంచి తొలగించవచ్చు. ఒకసారి పదవి నుంచి తొలగిస్తే ఆరేళ్లపాటు వారికి తిరిగి ఎన్నికయ్యేందుకు వీలుండదు.
- గ్రామ పంచాయతీ సర్పంచి, ఉప సర్పంచులు ప్రభుత్వ ఉత్తర్వులను పట్టించుకోవడం లేదని, హోదా, అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని కలెక్టర్ భావిస్తే, దర్యాప్తు పూర్తయ్యేదాకా ఆరు నెలలకు మించకుండా పదవి నుంచి తాత్కాలికంగా తొలగించవచ్చు. తర్వాత ఆరు నెలలకు మించకుండా ఎప్పటికప్పుడు పొడిగించవచ్చు. తాత్కాలిక తొలగింపు కాలావధి ఏడాదికి మించకూడదు.
- తొలగింపునకు గురైనవారు 30 రోజుల్లోగా ప్రభుత్వానికి అప్పీలు చేసుకోవచ్చు. దానిపై నిర్ణయం వచ్చేదాకా ప్రభు త్వం ‘స్టే’ ఉత్తర్వు జారీ చేయవచ్చు. వీరు అవిశ్వాస తీర్మానానికి నిర్వహించే సమావేశం మినహా మిగిలిన గ్రామ పంచాయతీ సమావేశాలకు హాజరుకావచ్చు.
- అగ్నిప్రమాదాలు, అంటు వ్యాధులు, తాగునీటి సమస్యలకు సంబధించిన పనులు చేపట్టేందుకు సర్పంచికి వీలు కల్పించింది.
ఇదీ చదవండి :