దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ షాద్‌నగర్ చటాన్‌పల్లి ఎదురుకాల్పుల ఘటన మృతుల వయసుపై నెలకొన్న సందేహాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించిన నలుగురిలో ముగ్గురు మైనర్లున్నారనే అనుమానాలుండటం.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధ్రువీకరణ పత్రాలు పరస్పర విరుద్ధంగా ఉండటం లాంటి కారణాలతో వారి వయసు నిర్ధారణ ఎలా చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఇలాంటి సందర్భాల్లో వయసు నిర్ధారణకు శాస్త్రీయ పద్ధతుల్ని అవలంబించడమే ప్రామాణికంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఒస్సిఫికేషన్ టెస్ట్(అస్థీకరణ పరీక్ష) ద్వారా వయసు నిర్ధారణ చేయడం ఆనవాయితీ.
దిశను పాశవికంగా హత్యాచారం చేసిన ఘటనలో నిందితులైన మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు ఈనెల 6న జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే. నలుగురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంగా వీరి వయసు 20 సంవత్సరాలకంటే ఎక్కువ ఉన్నట్లు నమోదు చేశారు.
నిందితులు చెప్పిన వివరాల ఆధారంగానే అలా చేశామనేది పోలీసుల వాదన. హత్యాచార ఘటనలో ‘సీన్ రీకన్‌స్ట్రక్షన్’ క్రమంలో నిందితులు ఎదురుతిరగడంతో ఎదురుకాల్పులు జరిగి ఆ నలుగురు హతమైనట్లు పోలీసులు చెబుతున్నారు.
మరొకరూ మైనరే!
ఆధార్ సంఖ్య ప్రకారం శివ, చెన్నకేశవులు, నవీన్‌ల పుట్టిన సంవత్సరం 2001గా ఉంది. వీరిలో ఇద్దరికి సంబంధించి బోనఫైడ్ సర్టిఫికెట్లలో ఉన్న వారి పుట్టిన తేదీలను బట్టి మైనర్లుగా భావించాల్సి వస్తోంది. ఒకరి పుట్టినతేదీ 15-08-2002గా.. మరొకరి పుట్టినతేదీ 10-04-2004గా పత్రాల్లో నమోదై ఉంది.
తాజాగా మరో నిందితుడి కుటుంబసభ్యులు తమ కుమారుడికి సంబంధించి బోనఫైడ్ సర్టిఫికెట్‌ను మంగళవారం సేకరించారు. అందులో అతని పుట్టినతేదీ 04-04-2004గా నమోదైంది. అంటే.. ఇతని వయసు 15 సంవత్సరాలా 8 నెలలన్న మాట. 2004లో పుట్టిన వీరిద్దరి మధ్య వయసు తేడా కేవలం ఆరు రోజులు మాత్రమే.
దీన్నిబట్టి మొత్తం నలుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ధ్రువపత్రాలను నిందితుల కుటుంబసభ్యులు జాతీయ మానవహక్కుల సంఘం సభ్యులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆదివారం కుటుంబసభ్యులను విచారించిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం ‘మీ కుమారులు మైనర్లయితే ధ్రువపత్రాలు ఇవ్వండి’ అని సూచించింది. తాము సేకరించిన ధ్రువపత్రాలను ఎన్‌హెచ్‌ఆర్సీ ఇచ్చిన వాట్సాప్ నంబరుకు నిందితుల కుటుంబ సభ్యులు పంపినట్లు సమాచారం.
ఎముకల దృఢత్వం ఆధారంగా...
వయసు నిర్ధారణ తెలిపే ధ్రువీకరణపత్రాలేవీ అందుబాటులో లేనప్పుడు లేదా వైరుధ్యంగా ఉన్నప్పుడు అస్థీకరణ పరీక్ష విధానాన్ని అవలంబిస్తుంటారు. ఎముకల దృఢత్వాన్ని పరీక్షించడం ద్వారా ఫోరెన్సిక్ వైద్య నిపుణులు వయసును అంచనా వేస్తారు.
సాధారణంగా 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులకు దిగువ అవయవాల ఎముక, తుంటి ఎముక దృఢంగా ఉంటుంది. దీన్ని మదించడం ద్వారా ఫోరెన్సిక్ నిపుణులు వయసు నిర్ధారణపై అంచనాకు వస్తారు. అయితే ఈ అంచనా తేదీతో సహా కచ్చితంగా ఉండదు. అసలు వయసుకు కొంచెం అటూఇటూగా ఉంటుంది. అయినా కేసుల విచారణ క్రమంలో ఈ నివేదికనే ప్రామాణికంగా తీసుకుంటారు.
మరోవైపు కేసుల దర్యాప్తు క్రమంలో ఎవరిదైనా వయసు నిర్ధారణ చేయాల్సి వచ్చినప్పుడు స్థానిక విచారణ పద్ధతుల్నీ అవలంబిస్తుంటారు. అవసరమైన వ్యక్తి వయసును గుర్తించేందుకు అతడి తల్లి ప్రసవించినప్పుడు గానీ, గర్భిణిగా ఉన్నప్పుడు గానీ అదే ఊరిలో ఇంకెవరైనా మహిళ అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారా? అని విచారించి ఒక నిర్ధారణకు వస్తారు. ప్రస్తుత ఉదంతంలో దిశ హత్యాచార నిందితులు మృతిచెందారు కాబట్టి వయసును ఎలా నిర్ధారణ చేస్తారనేదీ ఆసక్తికరంగా మారింది.
సంబంధిత కథనం: దిశ కేసు: నిందితులు వాడిన లారీ దృశ్యాలు విడుదల