చిత్తూరు జిల్లా వికోట మండల కేంద్రంలో జరిగిన ప్రమాదంలో తౌసిఫ్ (32) అనే వైద్యుడు దుర్మరణం పాలయ్యాడు. తౌసిఫ్.. కుప్పం మండలం పైపాల్యము ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా పని చేస్తున్నాడు. వికోట ఖాజీపేట వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన అతణ్ని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలో కన్నుమూశాడు. ఇదే ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
అనంతపురం జిల్లాలో..
అనంతపురం జిల్లా కదిరి మండలం కౌలేపల్లి వద్ద 42 నంబర్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ద్విచక్ర వాహనాన్ని ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొట్టగా.. అదే సమయంలో లారీ యువకుడిపై నుంచి దూసుకెళ్లింది. ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఓ మహిళ సురక్షితంగా బయట పడింది.
జాతరకు వచ్చి.. తిరిగి వెళ్తుండగా..
కర్నూల్ జిల్లా దేవనకొండ మండలం వెంకటాపురానికి చెందిన శంకరయ్య తన ఇద్దరు భార్యలు, ముగ్గురు కొడుకులతో వలస వెళ్లి కడపలో భవన నిర్మాణ కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 27న వెంకటాపురంలో జరిగిన జాతరకు కడప నుంచి కుటుంబంతో వచ్చారు. తిరుగు ప్రయాణంలో శంకరయ్య రెండో భార్య భాగ్యమ్మ, మొదటి భార్య కొడుకు అజయ్ కలిసి ఒక ద్విచక్రవాహనంలో కడపకు బయలు దేరారు. జాతీయ రహదారిపై రాయలచెరువు సమీపంలో లారీని క్రాస్ చేస్తుండగా.. ఎదురుగా వచ్చిన కారు వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భాగ్యమ్మ(45), అజయ్(19)లు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు.
ప్రకాశం జిల్లాలో..
ప్రకాశం జిల్లా తోటవారిపాలెం జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈపురుపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: కొప్పురావూరు హత్య కేసు ఛేదన... ఆరుగురు అరెస్టు