పలు జిల్లాల్లో ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు జరగనున్న సమయంలో.. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలోకి అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని అడ్డుకుంటున్నారు. వివిధ గ్రామాల్లో నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు చేసి.. నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు.
కర్నూలు జిల్లాలో...
పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న ఒకరిని కర్నూలు జిల్లా పెద్ద తుంబలం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 2,112 మద్యం సీసాలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 1,10,000 ఉంటుందని అంచనా వేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. ఈ తరహా చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆదోని మండల పరిధిలో.. భారీ స్థాయిలో మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. 117 కేసుల్లో కొన్ని నెలలుగా పట్టుకున్న సరుకును అధికారులు ట్రాక్టర్‌తో తొక్కించారు. ఎస్ఈబీ, రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించి.. రూ. లక్షలు విలువ చేసే మద్యాన్ని ఆలూరు రోడ్డపై ధ్వంసం చేశారు.
స్థానిక పోరు దృష్ట్యా రెండు రోజుల ముందు నుంచి మద్యం అమ్మకాలు నిలిపివేయనుండగా..దుకాణాల వద్ద జనం బారులు తీరారు. కర్నూలు జిల్లా గోస్పాడులో మందుబాబులు మద్యం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు.
గుంటూరు జిల్లాలో...
రేపల్లెలో నాటు సారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. చాట్రగడ్డలో కృష్ణా నది ఒడ్డున స్థావరంపై దాడి చేసి.. తయారీకి సిద్ధంగా ఉన్న సుమారు 2,500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశఆరు. నాటు సారా కోసం ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చెరుకుపల్లి మండలం కావూరు సమీపంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. వారి నుంచి 70 తెలంగాణ మద్యం సీసాలతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
విజయనగరం జిల్లాలో...
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో మూడు చోట్ల ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. రాయగడ డివిజన్‌లోని చిన్నపదం, పాలంతుల్సి, సందుబడి గ్రామాల్లో.. 13,800 లీటర్ల నాటుసారా, 300 లీటర్ల ఐడీ లిక్కర్‌ను ధ్వంసం చేశారు. విజయనగరం ఏస్ఈబీ అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో.. 9 బృంధాలతో 37 మంది అధికారులు, సిబ్బందితో పాటు పొరుగు రాష్ట్రం నుంచి 4 బృందాలతో కూడిన 60 మంది ఈ దాడుల్లో పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లాలో...
యర్రగొండపాలెం మండలంలోని అటవీ ప్రాంతంలో.. నాటు సారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. తయారీకి ఉపయోగించే బెల్లం ఉటను ధ్వంసం చేశారు. గంజివారిపల్లి సమీపంలోనూ 1,500 లీటర్ల ఊటను నాశనం చేసి.. 20 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు.
చిత్తూరు జిల్లాలో
తమిళనాడు నుంచి అక్రమంగా మద్యాన్ని రవాణా చేస్తున్న అయిదుగురు వ్యక్తులను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం తరిలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. 350 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని నిందితులపై కేసులు నమోదు చేశారు. నాలుగు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
ఇదీ చదవండి:
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై.. ముక్తకంఠంతో రాజకీయ పార్టీల వ్యతిరేకత