పసితనం పసుపుతాడుకు బందీగా మారుతోంది. తల్లిదండ్రుల మాటున పెరగాల్సిన బాల్యం... బరువు బాంధవ్యాల నడుమ చిక్కుకుపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు.. అంటే 18 నెలల్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ)లలో చిన్నారి పెళ్లిళ్లపై నమోదైన కేసులు విస్తుపోయే నిజాలను బహిర్గతం చేస్తున్నాయి. వివిధ జిల్లాల్లో కలిపి మొత్తం 213 బాల్య వివాహ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ కేంద్రానికి నివేదికను పంపింది. బాల్య వివాహ కేసులు అత్యధికంగా చిత్తూరు, అనంతపురం, కడపల్లో నమోదయ్యాయి. సీడబ్ల్యూసీలను ఆశ్రయించిన 44 మంది బాధితులకు ప్రభుత్వమే వసతి గృహాల్లో ఆశ్రయమిచ్చి రక్షణ కల్పించింది. స్థానిక అధికారుల పర్యవేక్షణ ఉండేలా ఆదేశిస్తూ మిగతా చిన్నారులను.. వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించారు.
కరోనా ప్రభావంతో మార్చి 21 నుంచి ఆగస్టు వరకు కొనసాగిన లాక్‌డౌన్ కాలంలోనూ బాల్య వివాహ ఘటనలు చోటు చేసుకున్నాయి. వివాహాలకు అనుమతి లేదని కఠిన నిబంధనలు విధించినా ఈ వ్యవధిలో 27 బాల్య వివాహ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ప్రభావంతో పేదల ఆర్థిక పరిస్థితి మరింత దుర్భరంగా మారి బాల్య వివాహాలు పెరిగే అవకాశం ఉందనే యూనిసెఫ్ నివేదిక నేపథ్యంలో ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
చైల్డ్‌లైన్‌కు సమాచారంతోనే...
బాధితులు చైల్డ్‌లైన్ నంబర్ 1098కు ఫోన్ చేయడం ద్వారానే ఎక్కువగా ఈ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మరికొందరు నేరుగా పోలీసులకు ఫోన్ చేశారు. చాలా తక్కువ సందర్భాల్లో బంధువులు, ఇతరులకు సమాచారం ఇవ్వడం ద్వారా బహిర్గతమయ్యాయి.