సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై రోజు వారీ విచారణ చేపట్టాలని సీబీఐ, ఈడీ కోర్టు నిర్ణయించింది. సీబీఐ దాఖలు చేసిన 11 ఛార్జ్ షీట్లు, ఈడీ దాఖలు చేసిన 5 అభియోగపత్రాలపై ఇవాళ విచారణ జరిగింది. హైదరాబాద్ లో కరోనా తీవ్రత ఉన్న కారణంగా కేసులను దసరా తర్వాత విచారణ చేపట్టాలని జగన్ తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టును కోరారు. జగన్ తరఫు న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం..... హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా రోజు వారీ విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ప్రాణాలను పణంగా పెట్టలేమని.. వీడియో కాన్ఫరెన్స్ విచారణకు అనుమతించాలని న్యాయవాదులు కోరారు. వీడియో కాన్ఫరెన్స్ విచారణ కోసం మెయిల్ ఐడీ సమర్పించాలని న్యాయవాదులకు సీబీఐ కోర్టు సూచించింది. అభియోగాల నమోదుపై వాదనలకు సిద్దం కావాలి న్యాయవాదులకు స్పష్టం చేసింది.
వాదనలు వినిపించేందుకు గడువు ఇవ్వాలని ఈడీ తరఫు న్యాయవాది కోరారు. సోమవారం వాదనలు వినిపించాలని లేనిపక్షంలో తగిన ఆదేశాలు జారీ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు స్టే ఉన్న కేసులను నవంబరు 9కి వాయిదా వేసిన న్యాయస్థానం.. మిగతా కేసులను సోమవారానికి వాయిదా వేసింది.
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసును రోజు వారీ విచారణ చేపడతామని సీబీఐ, ఈడీ కోర్టు తెలిపింది. ఓఎంసీ కేసులో విచారణ పూర్తైందని సీబీఐ తెలిపింది. ఇరువైపుల వాదనలు విని కేసులను త్వరగా తేల్చాలని కోరింది. డిశ్చార్జ్ పిటిషన్లతోపాటు.. అభియోగాల నమోదుపై వాదనలకు సిద్ధం కావాలన్న న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఎమ్మార్ కేసుల్లో హైకోర్టు స్టే ఉన్నందున.. విచారణను నవంబరు 10కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: