ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక విధానాన్ని పర్యవేక్షించకపోవడంతో పాటు.. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను అదుపులోకి తీసుకొని ఎటువంటి కేసులు లేకుండా వైకాపా నేత సూచన మేరకు వదలిపెట్టడం వంటి ఆరోపణలు రుజువు కావడంతో గుంటూరు జిల్లా అమరావతి సీఐ విజయకృష్ణను వీఆర్‌కు పంపుతూ పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.
పెదకూరపాడు నియోజకవర్గంలోని ఇసుక్ రీచ్‌ల నుంచి ఎటువంటి బిల్లులు, అనుమతులు లేకుండా వెళ్తున్న పలు వాహనాలను ఈనెలలో సీఐ విజయకృష్ణ తనిఖీలు జరిపి అదుపులోకి తీసుకున్నారు. వాటిపై కేసులు నమోదు చేయకుండా నియోజకవర్గానికి చెందిన వైకాపా కీలక నేత సూచన మేరకు నిందితుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదును తీసుకుని రవాణా వాహనాలను విడిచి పెట్టారని సీఐ అభియోగాలు ఎదుర్కొన్నారు.
ఇసుక మాఫియాతో చేతులు కలిపి ఈ తతంగం నడిపించారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఈవిషయాన్ని పలువురు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అంతర్గత విచారణ చేపట్టిన అధికారులు ఆరోపణలు రుజువు అయిన మేరకు.. అమరావతి సీఐ విజయకృష్ణను వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీచేశారు. ఈ విషయం పోలీసు డిపార్టుమెంటులో చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి:
Municipalities: చెత్త సేకరణపై జులై నుంచి యూజర్ ఛార్జీలు.. వ్యతిరేకిస్తున్న పాలకవర్గాలు!