రాజధాని అమరావతిలో సింగపూర్ సంస్థల కన్సార్షియం, ఏడీసీ సంయుక్తంగా తలపెట్టిన అంకురప్రాంత (స్టార్టప్ ఏరియా) అభివృద్ధి ప్రాజెక్టుకు పూర్తిగా ముగింపు పలికేందుకు రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదముద్ర వేసింది. స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్ కన్సార్షియం, ఏడీసీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కంపెనీ ఏడీపీని రద్దు చేసేందుకు అంగీకారం తెలిపింది.
అమరావతిలో 1691 ఎకరాల్లో చేపట్టిన అంకురప్రాంత అభివృద్ధి ప్రాజెక్టుని వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసింది. ఎలాంటి నష్ట పరిహారం కోరకుండా, పరస్పర అంగీకారంతో ప్రాజెక్టుకు ముగింపు పలికేందుకు సింగపూర్ కన్సార్షియం కూడా సమ్మతి తెలియజేసింది. ఇప్పుడు లాంఛనంగా బోర్డు సమావేశం పెట్టి, ఒప్పందం రద్దు పత్రాలపై రెండు సంస్థల ప్రతినిధులూ సంతకాలు చేస్తారు. ఆ తర్వాత కంపెనీ రద్దు (లిక్విడిటీ) ప్రక్రియ మొదలవుతుంది. కంపెనీ చట్టాల ప్రకారం ఆ ప్రక్రియంతా పూర్తి కావడానికి కనీసం ఆరేడు నెలలు పడుతుంది. ఏడీపీలో సింగపూర్ కన్సార్షియంకి 58 శాతం, అమరావతి అభివృద్ధి సంస్థకు (ఏడీసీ) 42 శాతం వాటా ఉంది. రెండు సంస్థలూ కలసి రూ.125 కోట్ల వరకు మూలధనాన్ని సమకూర్చాయి. వాటిలో రూ.18 కోట్లు వివిధ ఖర్చుల నిమిత్తం వెచ్చించినట్టు తేల్చారు. మిగతా డబ్బు కంపెనీ లిక్విడిటీ ప్రక్రియ పూర్తయితే భాగస్వామ్య సంస్థలకు ఇచ్చేస్తారు. ఏడీసీకి సుమారు రూ.50 కోట్లు తిరిగి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి:
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు 14 రోజుల్లోనే పూర్తి చేసేలా బిల్లు..!