PRC process almost ending: పీఆర్సీ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ సీఎంకు.. పీఆర్సీ కమిటీ తుది నివేదిక ఇవ్వనుంది. నివేదిక పరిశీలన అనంతరం..సీఎం జగన్ ఫిట్‌మెంట్ ఖరారు చేయనున్నారు. సీఎం నిర్ణయం తర్వాత ఉద్యోగ సంఘాలకు అధికారులు సమాచారం ఇవ్వనున్నారు. ఇవాళ సాయంత్రం ప్రభుత్వం అధికారికంగా పీఆర్సీ ప్రకటించే అవకాశం ఉంది.
employees agitation: మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల నిరసనలు, ర్యాలీలు కొనసాగుతున్నాయి. సమస్యలు పరిష్కరించాలని ఏలూరులో ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలు భారీ ర్యాలీ చేపట్టాయి. జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ఉద్యోగుల ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, శివారెడ్డి, ఫణిరాజు పాల్గొన్నారు.
అన్ని డిమాండ్లపై స్పందించాలి..
కృష్ణాజిల్లాలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఉద్యోగుల ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీకి ఉద్యోగసంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు హాజరయ్యారు. పీఆర్‌సీ సహా అన్ని డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. వెంకట్రామిరెడ్డి వల్ల సచివాలయ ఉద్యోగులు నష్టపోతున్నారన్నారు.
71 డిమాండ్లపై చర్చించాలి..
సాయంత్రం 5 గంటలకు అధికారుల భేటీ ఉందని సజ్జల చెప్పారని బండి శ్రీనివాసరావు తెలిపారు. కానీ అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదన్నారు. 71 డిమాండ్లతో కూడిన పీఆర్‌సీపై భేటీలో చర్చించాలని శ్రీనివాసరావు అన్నారు.